బాబు ముందు నామినేటెడ్ పోస్టుల పరీక్ష… తమ్ముళ్లకు మూడు తలనొప్పులు!

ఏపీలో కూటమి ప్రభుతం కొలువుదీరింది. ఈ సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లతో కలిపి 24 మందికి మంత్రిపదవులు దక్కాయి. ప్రస్తుతం వారంతా హ్యాపీగా వారి వారి పనుల్లో బిజీగా ఉన్నారని అంటున్నారు. అయితే… పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటినా కూడా తమను పట్టించుకోవడం లేదంటూ… నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్న తమ్ముళ్లు పార్టీ అంతర్గత సమావేశాల్లో ఫైర్ అవుతున్నారని తెలుస్తోంది.

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ – బీజేపీ – జనసేనలు కూటమిగా ఏర్పడి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రధానంగా టీడీపీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యే అభ్యర్థులు త్యాగాలు చేయాల్సి వచ్చింది. వీరితో పాటు.. క్షేత్ర స్థాయిలో పార్టీకోసం పనిచేసి, ఖర్చు చేసిన నాయకులు లిస్ట్ కూడా పెద్దగానే ఉంది. అయితే… వీరంతా తమ పార్టీ అధికారంలోకి వచ్చిందనే ఆనందంలో కంటే… నామినేటెడ్ పోస్టుల టెన్షన్ లో ఉన్నారని అంటున్నారు.

ఈ సమయంలో నామినేటెడ్ పోస్టుల ఇవ్వడానికి ఇంకా ఎంత సమయం తీసుకుంటారంటూ బాబుపై వీరంతా ఒత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు. ఆ సంగతి అలా ఉంటే… ఈ సమయంలో వీరికి కూటమి పార్టీల నుంచి సరికొత్త సమస్యలు తెరపైకి వచ్చాయని చెబుతున్నారు. ఇందులో భాగంగా… ఇటీవల జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో నామినేటెడ్ పోస్టుల ప్రస్థావన తెచ్చిన నాదేండ్ల మనోహర్… ఈ పదవుల విషయంలో తమ పార్టీ వారికీ న్యాయం చేయాలని కోరారు.

దీనికి సానుకూలంగా స్పందించిన చంద్రబాబు… నామినేటెడ్ పోస్టులకోసం జనసేన నిర్ణయించిన పేర్ల జాబితాను తనకు ఇవ్వాలని, వారందరికీ పదవులు అందేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో… అనుకునందే తడవుగా జనసేన ఓ లిస్ట్ రెడీ చేసిందని అంటున్నారు. ఇందులో భాగంగా ఆ లిస్ట్ లో సుమారు 20 పేర్లు ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో టీటీడీ బోర్డ్ మెంబర్స్ కోసం కూడా రిక్వస్ట్స్ ఉన్నాయని అంటున్నారు.

ఇదే సమయంలో.. తమకు మంత్రిపదవుల్లో అన్యాయం జరిగింది. తమకు ఒకే ఒక్క మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి… నామినేటెడ్ పదవుల్లో అయినా తమకు న్యాయం చేయాలని బీజేపీ నుంచి అప్లికేషన్స్ అందుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో బీజేపీ నేతలకు కూడా బాబు పాజిటివ్ గా పచ్చజెండా ఊపారని చెబుతున్నారు. దీంతో… వారు కూడా 20కి తగ్గకుండా జాబితా సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో.. తమ్ముళ్లు నిప్పులు కక్కుతున్నారని అంటున్నారు.

జనసేనకు ఓ 20, బీజేపీకి 20 నామినేటెడ్ పోస్టుల రిక్వస్టులు వస్తే… వాళ్లే కీలకపదవులు అన్నీ కోరుతుంటే… మరి తమ పరిస్థితి ఏమిటంటూ త్యాగాలు చేసిన తమ్ముళ్లు, ఖర్చు చేసిన తమ్ముళ్లు ఆవేశపడుతున్నారని చెబుతున్నారు. ఈ మేరకు చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో కొంతమంది ఉండగా.. చినబాబుని ప్రసన్నం చేసుకునే పనిలో మరికొంతమంది ఉన్నారని చెబుతున్నారు. ఇలా బీజేపీ, జనసేన నేతలతోనే పెద్ద చిక్కు వచ్చిపడిందంటే.. మరో సమస్య తెరపైకి వచ్చిందని చెబుతున్నారు.

ఇందులో భాగంగా… వైసీపీ నుంచి కూడా ఈ నామినేటెడ్ పదవులపై ఆశతో చాలా మంది ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మరికొంతమంది కీలక నేతలు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పటికే సైకిల్ ఎక్కిన డొక్కా మాణిక్యం వంటి వారు.. చంద్రబాబు వద్ద మాట తీసేసుకున్నారని చెబుతున్నారు. దీంతో… ఈ నామినేటెడ్ పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ్ముళ్లు నిప్పులు కక్కుతున్నారని, ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. మరి బాబు వీరిని ఎలా కూల్ చేస్తారు.. ఈ నామినేటెడ్ పదవుల పంపకాల పరీక్షలో ఏ పర్సంటేజ్ తో పాసవుతారనేది వేచి చూడాలి.