బిగ్ ఇష్యూ… రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు?

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో మాజీముఖ్యమంత్రి చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు… వైద్యపరీక్షల అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాడి వేడిగా వాదనలు జరుగుతున్నాయి.

కోర్టులో వాదనల సంగతి అలా ఉంటే… మరోపక్క చంద్రబాబుపై పెట్టిన సెక్షన్స్ ని బట్టిచూస్తే బెయిల్ అనుమానమనే మాటలు వినిపిస్తున్నాయి. దీంతో కోర్టు బయట వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇందులో భాగంగా విజయవాడలో ఏసీబీ కోర్టు బయట భారీ సంఖ్యలో వాహనాలు, భారీ సంఖ్యలో పోలీసులు చేరుకుంటున్నారు.

ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. మరోపక్క చంద్రబాబు కారుకు ముందు వెనుక భారీ సంఖ్యలో వాహనాలు ఉండేలాగా కాన్వాయ్ ని సిద్ధం చేస్తున్నారు. అయితే, పోలీసులు ఒకపక్క భద్రత కోసమే ఈ ఏర్పాట్లు అని చెబుతున్నప్పటికీ.. టీడీపీ శ్రేణులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

దీంతో… ఒకవేళ చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు కోరినట్టుగా న్యాయమూర్తి రిమాండ్ కు ఇస్తే ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆ వాహనాలను భారీగా పోలీసులు మోహరించారని పుకార్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో విజయవాడ కోర్టు హాల్ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు వరకు రోడ్డు మార్గాన్ని ట్రాఫిక్ పోలీసులు కంట్రోల్ లోకి తీసుకున్నారని గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి.

దీంతో చంద్రబాబును రిమాండ్ కు పంపే ఛాన్స్ ఉందేమో అనే ఆందోళన టీడీపీ శ్రేణుల్లో వ్యక్తం అవుతుంది. దీనికి బలం చేకూరుస్తూ ఏపీ పోలీసులు చేస్తున్న ఏర్పాట్లు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని అంటున్నారు! ఏమి జరగబోతుందనేది వేచి చూడాలి!