జాతీయ మీడియా ఎదుట బీజేపీపై మండిపడ్డ చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు శనివారం ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. ఏపీలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. మోడీ విధానాలతో ఆర్ధిక వ్యవస్థ కుదేలైందన్నారు.

చెప్పిన హామీలేవీ మోడీ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన వెల్లడించారు. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను అందరూ గమనిస్తున్నారు. రాజకీయ పార్టీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి అని సూచించారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తామన్న బీజేపీ హామీ ఏమైందని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

దేశంలో పెట్రోల్ ధరలు ఊహించని విధంగా పెరిగాయి. దేశంలో రైతులంతా నిరాశ, నిస్పృహలతో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసారు. విభజన హామీలను కేంద్రం ఏ ఒక్కటి అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. విభజన హామీలకు 29 సార్లు ఢిల్లీకి వెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన తెలిపారు. 

నీరవ్ మోడీ, విజయ్ మాల్యాలు దేశం నుండి పారిపోయిన పట్టించుకోలేదని విమర్శించారు.  తెలంగాణాలో టీడీపీని ఉద్దేశపూర్వకంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నించారన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు తీసుకున్నారన్నారు. వైసీపీ తో బీజేపీకి చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. నేర చరిత ఉన్న పార్టీలకు మద్దతు ఇస్తున్న కారణంగానే బీజేపీతో తెగదెంపులు చేసుకున్నామని సంచలన వ్యాఖ్యలు చేసారు. 

హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన ఘనత మాదే. రాష్ట్రాల మధ్య ప్రధాని సమస్యలు సృష్టిస్తున్నారు. కేంద్రం ఏపీకి వ్యతిరేకంగా పని చేస్తుందని సంచలన ఆరోపణలు చేసారు. వెనకబడిన జిల్లాలకు నిధులిచ్చి మళ్ళీ వెనక్కి లాగేసుకున్నారన్నారు. విశాఖ రైల్వే జోన్ ను పక్కన పెట్టేసారు. తిత్లీ, హుద్‌హుద్‌ తుఫాన్లతో తీవ్ర నష్టపోయాం. రాజనాధ్ రాష్ట్రానికి వచ్చి తిత్లీ పై మాట కూడా మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేసారు.

గతంలో గవర్నర్ ఎప్పుడూ పరిపాలనలో జోక్యం చేసుకోలేదు. కానీ జగన్ పై దాడి జరిగిన కొద్దిసేపటికే డీజీపీకి ఫోన్ చేసి వివరాలు అడిగారు. ఎయిర్ పోర్టులో దాడి జరిగితే మాకు సంబంధం లేదు. అయినా ప్రతి ఒక్కరూ తమపై నిందలు వేస్తున్నారంటూ ఆగ్రహించారు. ఇలాంటి ఘటనల వలన ఫిన్ టెక్ ఉత్సవం, విశాఖ క్రికెట్ మ్యాచ్ వంటి అంతర్జాతీయ కార్యకలాపాలపై ప్రభావం పడుతోంది అని సూచించారు.