బీజేపీ విషయంలో తగ్గేదేలే అంటున్న బాబు.. ప్లాన్ బి స్టార్ట్!

2014 ఎన్నికల్లో పైకి తమకు తామే గెలిచామని టీడీపీ ఎంత చెప్పుకున్నా… ఆ గెలుపులో బీజేపీ – జనసేనల పాత్ర చాలా కీలకమనేది తెలిసిన విషయమే! అయితే.. 2019 లో ఆ ఛాన్స్ దొరక్క బాబు పొందిన ఫలితం అందరూ ఊహించిందే! దీంతో 2024లో ఎలగైనా బీజేపీని కలుపుకుపోవాలని బాబు విశ్వప్రయత్నాలు చేశారు! అయితే… ఇక ఆ ఛాన్స్ లేదని అనుకున్నారో ఏమో కానీ, ఇప్పుడు అసలు బాబు బయటకు వచ్చారు!

అవును… 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసి ప్రయాణం చేసే అవకాశాలు దాదాపు లేవని చంద్రబాబు గ్రహించినట్లున్నారు. దీంతో.. ఇక బీజేపీ కోసం ఎదురుచూడటం కంటే, బీజేపీలో ఉన్న నేతలకు గాలాలు వేసి, తమ పార్టీలోకి తెచ్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా… బీజేపీని వదిలిన కన్నాకు ఆశ్రయం ఇవ్వాలని బాబు నిర్ణయించారంట!

సాధారణంగా.. ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు, ఆ పార్టీని వీడిన వారిని తమ పార్టీలో చేర్చుకోరు! కానీ.. బీజేపీని వీడిన కన్నా లక్ష్మీనారాయణకు క్లియరెన్స్ ఇవ్వడంతో ఇక బీజేపీతో దోస్తీపై బాబు లైట్ తీసుకున్నారని అనుకోవాలి! ఇదే క్రమంలో.. గతంలో టీడీపీ నుంచి వెళ్లిన బీజేపీలో చేరిన టీడిపీ సీనియర్లను వెనక్కి తెప్పించే పనిలో కూడా ఉన్నారట బాబు!

ఇంతకాలం బీజేపీని బుజ్జగించి, రిక్వస్టులు పెట్టుకున్న బాబు.. ఇకపై ఇలా కీలక ఆలోచన చేశారన్న మాట. ఇదేక్రమంలో… బీజేపీని కాదని జనసేన సైతం తమతో కలిసిరాని పక్షంలో.. ఒంటరి పోరాటం తప్పదని ప్లాన్ బి కూడా రెడీ చేస్తున్నారన్నమాట. దీంతో.. తన పని తాను చేసుకుంటూ పోతున్నారు చంద్రబాబు. దీనివల్ల రెండు ప్రయోజనాలున్నాయని అంటున్నారు విశ్లేషకులు!

ఒకటి… “మన బలం మనమే తప్ప, పక్క పార్టీలు కాదు” అని కేడర్ కు చెప్పుకునే ప్రయత్నంతో పాటు, “ఈసారి కూడా ఒంటరిగానే వెళ్తున్నాము” అని కేడర్ కు ఇప్పటినుంచే సంకేతాలు ఇస్తూ కాస్త ధైర్యం నూరిపోసినట్లవుతుంది! రెండు… బీజేపీ – జనసేన కూటమిపై పరోక్షంగా ఒత్తిడి తెచ్చినట్లు కూడా అవుతుంది! ఇది బాబు గారి ప్లాన్ బి!!