ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా… ఏపీలో రాజకీయాలు అప్పుడే వేడెక్కేశాయి. ఏది ఏమైనా మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ పావులు కదుపుతుంటే… ఎలాగైనా జగన్ ను గద్దె దించాలని టీడీపీ – జనసేనలు పోరాడుతున్నాయి. ఈ క్రమంలో… జగన్ పైకి ఒంటరిగా వెళ్తే వీరమరణమే అని పవన్ పైకి చెబుతున్నా… బాబుకు సైతం లోలోపల అదే ఫీలింగ్ అని అంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో కలిసి వెళ్లబొతున్న సమయంలో కూడా పవన్ కు తన మార్కు రాజకీయాలు రుచి చూపిస్తున్నారంట చంద్రబాబు.
మంచో చెడో.. ఇద్దరికీ కలవడం అవసరం. ఫలితంగా… జనసేన – టీడీపీ కలుస్తున్నాయి. కలిసి పోటీచేయబోతున్నాయి. ఈ విషయంలో తమకు ఒంటరిగా పోటీచేసి జగన్ ఎదుర్కోనే అంత సీన్ లేదని పవన్ నిజాయితీగా ఒప్పేసుకుంటున్నారు. కానీ… చంద్రబాబు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. అయితే… ఇప్పటికీ అధికారికంగా ఈ రెండు పార్టీలు కలవలేదు. కారణం… పవర్ షేరింగ్!
అవును… రాబోయే ఎన్నికల్లో పైకి చంద్రబాబు ఎంత బిల్డప్ ఇచ్చినా… పవన్ అవసరం ఆయనకు పుష్కలంగా ఉందని చెబుతున్నారు హరిరామ జోగయ్య. జనసేన పార్టీ శ్రేయోభిలాషిగా పేరు సంపాదించుకున్న ఆయన… రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉండేందుకు చంద్రబాబు అంగీకరిస్తేనే.. పొత్తుకు ఒప్పుకోమని రకరకాల వేదికలపైనుంచి పవన్ కు సూచిస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కూడా.. అందుకు అంగీకరించి.. బాబు దగ్గర ప్రపోజల్ పెట్టారంట. అయితే… ఆ విషయంలో సమాధానాన్ని చంద్రబాబు పోస్ట్ పోన్ చేశారని తెలుస్తుంది.
ఆ సంగతి అలా ఉంటే… ఈలోపు తన అనుకూల మీడియాతో పవన్ స్థాయిపై టీడీపీ నేతలతో కామెంట్లు చేయిస్తున్నారు చంద్రబాబు! అసలు పవన్ కు అంత సీను లేదని.. రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయిన పవన్ కు సీఎం కుర్చీ ఇవ్వడం ఏంటని ఎద్దేవా చేసేలా మాట్లాడిస్తున్నారు. పైగా… కనీసం ఎమ్మెల్యేగా కూడా అనుభవం లేకుండా సీఎం కుర్చీ ఎక్కితే రాష్ట్రం నాశనం అయిపోతుందని.. నెపం అటు నెట్టేస్తున్నారు. దీంతో… ఇదంతా బాబు స్కెచ్ లో భాగమని అంటున్నారు విశ్లేషకులు.
ఏ నాయకుడు ఎక్కడ ఎలా మాట్లాడినా… పవర్ షేరింగ్ విషయంలో పవర్ స్టార్ తగ్గకూడదని సూచిస్తున్నారు జనసైనికులు. ఇవన్నీ చంద్రబాబు ఆడుతున్న తనమార్కు రాజకీయ డ్రామాలని.. వాటి విషయంలో పవన్ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. మరి పవర్ షేరింగ్ విషయంలో పవన్ గట్టిగానే నిలబడతారా… లేక, బాబు రాజకీయ చతురత ముందు జావకారిపోతారా అన్నది వేచి చూడాలి!
