దమ్ముంటే అరెస్టు చెయ్.! చంద్రబాబు ధైర్యమేంటి.?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై ‘వ్యవస్థల్ని మేనేజ్ చేయగల సమర్థుడు’ అన్న ప్రత్యేకమైన గుర్తింపు వుంది. నిజంగానే, ఆయన అంత సమర్థుడా.? అంటే, ఆయన మీదున్న చాలా కేసుల్లో.. ఏదీ ఇప్పటిదాకా ఆయన్ని దోషిగా నిరూపించలేకపోయింది మరి.!

దేశంలో అత్యంత ఎక్కువ కేసుల్లో ‘స్టేలు’ తెచ్చుకున్న వ్యక్తిగా చంద్రబాబుకి వున్న ట్రాక్ రికార్డు గురించి రాజకీయాల్లో ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే వుంటుంది. ప్రధాన మంత్రులుగా పనిచేసినవాళ్ళు కూడా ఈ స్థాయిలో వ్యవస్థల్ని మేనేజ్ చేయలేరేమో.. అంటుంటారు రాజకీయ ప్రత్యర్థులు.

అసలు విషయానికొస్తే, చంద్రబాబు హయాంలో జరిగిన అవకతవకలకు సంబంధించి ఆయన అరెస్టు అవడం ఖాయమంటోంది అధికార వైసీపీ. అదసలు సాధ్యమయ్యే పనేనా.? ఒకవేళ సాధ్యమయ్యేదే అయితే, అమరావతి కుంభకోణంలో ఏనాడో చంద్రబాబుని వైసీపీ సర్కారు అరెస్టు చేయించేదే.!

నాలుగేళ్ళుగా ఇదిగో అరెస్టు.. అదిగో అరెస్టు.. అంటూ చంద్రబాబు మీద వైసీపీ ముఖ్య నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తూనే వున్నారు. ఇప్పుడు ఇంకోసారి అదే మాట చెబుతున్నారు వైసీపీ ముఖ్య నేతలు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే మరింత ధీమాగా వున్నారు.

అయితే, వైసీపీ హెచ్చరికల్ని చంద్రబాబు లైట్ తీసుకున్నారు. ‘దమ్ముంటే అరెస్టు చేస్కో పో..’ అంటూ తేల్చి పారేశారు చంద్రబాబు. ‘ఏం పీక్కుంటావో పీక్కో..’ అని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడు బంతి వైసీపీ కోర్టులో వుంది.! అసలు చంద్రబాబు ధైర్యమేంటి.?