వైసీపీ అన్నంత పని చేసింది, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ చేసినట్టే కుప్పంలో చంద్రబాబు నాయుడి పునాదుల్ని కదిలించేశారు. కొన్ని దశాబ్దాలుగా కంచుకోటని చెప్పుకుంటున్న పలు పంచాయతీల్లో టీడీపీని మట్టికరిపించేశారు వైసీపీ మద్దతుదారులు. కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా, 74 పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు. చంద్రబాబుకు అత్యంత సాన్నిహిత్యం ఉన్న గుడుపల్లె మండలంలో 13 పంచాయతీల్లో వైసీపీ పాగా వేసింది. దీన్నిబట్టి కుప్పంలో పెద్దిరెడ్డి ఏ స్థాయి ప్లానింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. బెదిరింపులు, డబ్బు పంపకం లాంటి చర్యలతో భయపెట్టి ఓట్లు వేయించుకున్నారని టీడీపీ అంటున్నా జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది.
అధికార పక్షం అక్రమాలకు పాల్పడుతుందని ముందే తెలిసినప్పుడు చంద్రబాబు వాటిని ధీటుగా ఎదుర్కునే వ్యూహం ఏదీ సిద్ధం చేసుకోలేదా అనేదే పెద్ద ప్రశ్న. కొందరేమో స్థానిక నాయకుల ఓవర్ కాన్ఫిడెన్స్ కొంప ముంచిందని అంటున్నారు. ఎవరొచ్చినా కుప్పం జనం చంద్రబాబు వెంటే ఉంటారని వారు అనుకున్నారు. బాబుగారు వీడియో కాన్ఫరెన్సులు పెట్టి హెచ్చరించినా నాయకులు ఉదాసీనంగానే వ్యవహరించారనేది వాస్తవం. అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుగారి మెజారిటీ 50 వేల నుండి 30 వేలకు పడిపోయినప్పుడే ట్రెండ్ మారిందని టీడీపీ నాయకులు గ్రహించి ఉండాల్సింది. కానీ గ్రహించలేదు. అతి నమ్మకానికి పోయి దెబ్బతిన్నారు. ఈ ఫలితాలతో క్షేత్ర స్థాయిలో పార్టీని ఆదరిస్తూ వస్తున్న సంప్రదాయ ఓటు బ్యాంకుకు గండి పడిందని తేటతెల్లమైంది.
ఈ ఫలితాలు చూశాక చంద్రబబు గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్టు ఉన్నాయి. అందుకే కుప్పం పర్యటనకు రెడీ అయ్యారు. 25 నుండి 27 వరకు కుప్పంలోనే బాబుగారు మకాం వేయనున్నారు. ఈ పర్యటనలో ఓటు బ్యాంకు ఎలా చీలింది, వైసీపీ అమలుచేసిన వ్యూహాలు ఏంటి, జనంలో పార్టీ మీద, తన మీద నమ్మకం ఎలా సన్నగిల్లింది అనే అంశాలను విశ్లేషించుకోనున్నారట చంద్రబాబు. ఈ సమావేశంలో జిల్లా నేతల నుండి పంచాయతీ నాయకుల వరకు అందరూ హాజరవుతారని, ఈ పర్యటనలో ప్రక్షాళన తప్పనిసరని అంటున్నారు. మరి చంద్రబాబు కుప్పంకు ఎలాంటి రిపేర్లు చేసుకుని వస్తారో చూడాలి.