వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. సార్వత్రిక ఎన్నికల అనంతరం వస్తున్న ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు ప్రతిష్టార్మకంగా తీసుకున్నాయి. జమిలి ఎన్నికల కోసం తహతహలాడిపోతున్న చంద్రబాబు అయితే ఈ ఎన్నికల వేదికగా టీడీపీ సత్తా చాటాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. కానీ బ్యాడ్ లక్.. ఆయనకు సరైన అభ్యర్థి లభించలేదు. అందుకే చేసేది లేక గత ఎన్నికల్లో ఓడిన పనబాక లక్ష్మినే అభ్యర్థిగా నిలబెట్టారు. మొదట్లో పనబాక పోటీకి విముఖత చూపినా ఏదోలా నచ్చజెప్పి ఒప్పించారు. అందరికంటే ముందుగా క్యాండిడేట్ పేరును ప్రకటించి ప్రజలకు దగ్గరయ్యే పని మొదలుపెట్టారు. జగన్ సీఎం అయినప్పటి నుండి చంద్రబాబు ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత పుట్టుకొచ్చింది, మధ్యంతర ఎన్నికలు పెడితే జగన్ చిత్తుగా ఓడిపోతారు, మళ్ళీ తమకే పట్టం కడతారని ఊదరగొడుతున్నారు .
అయితే జనంలో మాత్రం జగన్ మీద చంద్రబాబు చెబుతున్న స్థాయిలో వ్యతిరేకత అయితే లేదనేది వాస్తవం. ఈ సంగతి ఆయనకు కూడ తెలుసు. కానీ వ్యతిరేకత ఉందని జనంలో అభిప్రాయం కల్పించడానికి చేస్తున్న ప్రయత్నమే ఇదంతా. అయితే ఈ ప్రయత్నానికి పరీక్ష అన్నట్టు తిరుపతి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. సో.. జగన్ మీద వ్యతిరేకత ఉందని ప్రూవ్ చేయాలంటే ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిచి తీరాలి. కానీ అలాంటి సిట్యుయేషన్ లేదక్కడ. బల్లి దుర్గాప్రసాదరావు మరణంతో పార్టీ మీద సానుభూతి ఉంది. లోక్ సభ పరిధిలోని ఎమ్మెల్యేలంతా వైసీపీ నేతలే. ఒక్క ఆనం రామనారాయణరెడ్డి మినహా మిగతా ఆరు అసెంబ్లీ స్థానాల్లోని ఎమ్మెల్యేలు వైసీపీ గెలుపు కోసం తప్పకుండా కృషిచేస్తారు. ఇక ఎలాగూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యవేక్షణ ఉండనే ఉంటుంది. చంద్రబాబు మోస్తున్న అమరావతి సెటిమెంట్ ఫలిస్తుందో లేదో చెప్పేలేని స్థితి.
ఓడిపోవడానికి టీడీపీకి ఎన్ని ప్రతికూలతలు ఉన్నాయో గెలవడానికి వైసీపీకి అంతకు మించి అనుకూలతలు ఉన్నాయి. అందుకే చంద్రబాబు ఇంకొక ప్లాన్ వేశారు. అదే వైసీపీ మెజారిటీని తగ్గించడం. గత ఎన్నికల్లో వైసీపీ 2.28 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో నెగ్గింది. గెలవలేకపోయినా ఆ మెజారిటీ నుండి సగమైనా లాగేస్తే పరువైనా దక్కుతుందనేది చంద్రబాబుగారి ఆలోచనట. ఆ తగ్గుదలను చూపించి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిందని అనడానికి తగ్గిన మెజారిటీయే సాక్ష్యమని షో చేయవచ్చని, అప్పుడు ఓడిపోయినా క్రితంసారి కంటే బెటర్ పెర్ఫార్మెన్స్ చేశారనే పేరు, సానుభూతి ఉన్నప్పటికీ వైసీపీ మెజారిటీ కోల్పోయిందని, ఇది వ్యతిరేక పవనాలకు సాక్ష్యమనే భావన ప్రజల్లో ఏర్పడుతుందని చంద్రబాబు ఆశ కాబోలు. అందుకేనేమో ఉప ఎన్నికలను కూడ సార్వత్రిక ఎన్నికల లెవల్లో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ రాబిన్ శర్మను రంగంలోకి దింపారు.
ఈ ఎన్నికల నుండి బాబుగారు ఇంకొక లాభాన్ని కూడ ఆశిస్తున్నారు. ఎన్నికలో బీజేపీ తమ అభ్యర్థినే పోటీకి దింపాలని పట్టుబట్టుకుని ఉంది. అన్నీ కుదిరి అదే జరిగితే మరోసారి బీజేపీ ఓడిపోతుందని, గత ఎన్నికలో నోటా కంటే తక్కువ ఓట్లు పొందిన వారు ఈసారి మహా అయితే ఇంకో పదివేలు తెచ్చుకుంటారేమోనని, దాన్ని చూపించి మీకంటే మేమే బలవంతులమని చెప్పి పొత్తుకు ఆహ్వానించవచ్చని ఆశపడుచున్నారట. మరి వైసీపీ మెజారిటీ తగ్గిపోయి చంద్రబాబు ఆశలు ఫలిస్తాయేమో చూడాలి.