ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడులో అసంతృప్తి తారాస్థాయిలో ఉంది. ఓడిపోయిన మొదట్లో ఏం చేయాలో పాలుపోక అధికార పక్షానికి తల అప్పగించేసిన ఆయన మెల్లగా కోలుకుని ఎదురుతిరుగుదాం అనుకునేలోపు కరోనా వచ్చి పడింది. దీంతో ఏడు నెలలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఒకవైపు జగన్ సంక్షేమం అంటూ డబ్బులు పంచుతూ దూసుకునిపోతుంటే ఆయన మాత్రం జూమ్ మీటింగ్లతో కాలం గడపాల్సి వచ్చింది. అధినాయకుడు అందుబాటులో లేకపోవడంతో శ్రేణులు కూడ నీరసించాయి. కరోనా కాస్త తగ్గుముఖం పట్టాక ధైర్యం చేసి బయటికొచ్చిన ఆయనకు కళ్ళు తిరిగే పరిస్థితి తలెత్తింది. అదే సొంత నాయకుల మౌనం. కేసులకు భయపడో లేకపోతే ఇక పుంజుకోలేమన్న నిరాశతోనో చాలామంది లీడర్లు మౌనవ్రతం తీసుకున్నారు. వాళ్ళని తిరిగి యాక్టివ్ చేయడానికి చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు.
ఇవన్నీ కలిసి ఆయనలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయేలా చేశాయి. అందుకే మైక్ పుచ్చుకుంటే ఊగిపోతున్నారు. ఇంతకుముందున్న శాంతం ఆయనలో కనిపించట్లేదు. జాలి మాటలు, వింత ప్రస్తావనలు చేస్తున్నారు. జనం ముందు తన ఓటమి సమ్మతమైంది కాదని, మీరెందుకు నన్ను ఓడించారో నాకే తెలియట్లేదని అంటున్నారు. మొన్నామధ్యన దేవాలయాల ధ్వంసం అంశంలో రామతీర్థంలో మాట్లాడుతూ మతం గొడవ మొదలుపెట్టారు. హిందువులు, క్రైస్తవులు అంటూ బీజేపీ పాట అందుకున్నారు. బీజేపీ సైతం బాబు మాటలు విని మేము కూడ ఇంత పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు కదయ్యా అనుకున్నారు. ఇక తాజాగా భోగి సంబరాల్లో పాల్గొన్న ఆయన రైతుల విషయంలో వైసీపీ తీసుకొచ్చిన జీవోలను భోగి మంటల్లో వేసి తగలబెట్టి కోపాన్ని చల్లార్చుకున్నారు.
మీ అందరికీ పూనకం వచ్చింది అప్పుడు. ఓట్లు వేశారో ఏం జరిగిందో నాకైతే తెలియదు. నేను ఏం తప్పు చేశానో నాకు తెలియటం లేదు. మిమ్మల్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని అనుకోవడమే నా తప్పైతే నన్ను క్షమించండి అంటూ జనమేదో పెద్ద తప్పు చేసినట్టు విషాదాన్ని ప్రదర్శించారు. అధికారం పోయి రెండేళ్లు గడుస్తున్నా చేసిన తప్పులను గుర్తెరగకుండా జనం జగన్ కు ఓట్లేసి తప్పుచేశారని అనడం 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు సమంజసం అనిపించుకుంటుందా. అయినా చంద్రబాబు చేసిన తప్పులను వెతుక్కోవాల్సి పనిలేదు. కళ్ళు మూసుకుంటే కనిపించేస్తాయి. అమరావతి, ప్రత్యేక హోదా, ఓటుకు నోటు మూలంగా హైదరాబాద్ నగరాన్ని వదులుకోవడం, పోలవరం అవినీతి, సంక్షేమ పథకాల అమలులో అలసత్వం, సొంత పేరు కోసం తాపత్రయం. ఇలా చెప్పుకుంటే చాలానే ఉన్నాయి.
ఇన్ని తప్పులు చేసి కూడ మీరు నన్నెందుకు ఓడించారో తెలియట్లేదని ఆయన అనడం చూస్తే అది ఫ్రస్ట్రేషన్ తాలూకు అయోమయం అనిపిస్తోంది. పండుగ పూత జనం మధ్యకు వచ్చిన ఆయన నాదేం లేదు.. మీదే తప్పు అన్నట్టు తన ఓటమి బాధ్యతను జనం మీదకు తోసేయడం చిత్రంగానే ఉంది.