ప్రతిపక్షం ఉనికి చాటుకోవాలి అంటే ప్రభుత్వం మీద పోరాడాల్సిందే. ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు, చేసే విమర్శలకు పాలక వర్గం బెంబేలెత్తాలి. అప్పుడే ప్రతిపక్షం మీద జనంలో హైప్ క్రియేట్ అవుతుంది. ఇదే రాజకీయాల్లోని ఫైటింగ్ ఫార్ములా. ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ ఈ పోరాట బాటలో నడిచినవే. గతంలో టీడీపీ కూడ కాంగ్రెస్ మీద ఇలా ఫైట్ చేసే 2014 ఎన్నికల్లో అధికారం దక్కించుకుంది. కానీ ఈసారి మాత్రం ఈ ఫార్ములాను ఫాలో కాలేకపోతోంది టీడీపీ . 2019 ఎన్నికల తర్వాత ప్రతిపక్షంలో కూర్చొని యేడాది గడిచినా ఏం చేయాలో తెలియక సతమతమవుతూనే ఉంది.
చంద్రబాబుకు పోరాటాలు కొత్తేమీ కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీతో హోరాహోరీ తలపడి పార్టీని నడిపిన ఘనత బాబుది. అలాంటి చంద్రబాబుగారికి ఈ దఫాలో అన్నీ ప్రతికూల పరిస్థితులే తప్ప ఎక్కడా అనుకూలతలు కనిపించడం లేదు. వైఎస్ జగన్ సంక్షేమ పతాకాలతో వేల కోట్లు ప్రజల ఖాతాల్లో వేస్తూ అంతకంతకు పాపులర్ అవుతూ వెళుతున్నారు. ఏడాది పాలనలో ఎక్కడా పెద్ద పొరపాట్లు చేయలేదు. ఒక్క అమరావతి విషయంలో తప్ప ప్రత్యర్థులకు జగన్ ను విమర్శించడానికి అవకాశమే దొరకలేదు. దీంతో చంద్రబాబు ఆ అమరావతి అంశాన్ని పట్టుకునే వైఎస్ జగన్ మీద చెలరేగిపోవాలని చూస్తున్నారు.
కమ్ముకున్న సందేహాలు, భయాలు :
కానీ అదే ఆయన్ను మరోవైపు నుండి డ్యామేజ్ చేస్తోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రజలు బాబు మూడు రాజధానులను వద్దనడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది చాలదన్నట్టు పార్టీలో బోలెడు సందేహాలు, అంతులేని భయం ఆవరించి ఉన్నాయి. పార్టీలోని మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు అందరికీ పార్టీ భవిష్యత్తు మీద నమ్మకం కలగట్లేదు. ఎన్ని చేసినా తిరిగి నిలబడగలమా అనుకుంటున్నారు. పోరాటాలు చేయాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇప్పటికే గత ఎన్నికలకు పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టి గెలవక ఆర్థికంగా కుంగిపోయి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఖర్చులు భరించే శక్తి తమకు లేదంటున్నారు లీడర్లు.
సరే హైకమాండ్ నుండి ఏమైనా సహాయం అందుతుందా అంటే అదీ లేదు. మాటలు తప్ప మూటలు లేవు. అందుకే నాయకులు పోరాటాలు చేయడానికి వెనకాడుతున్నారు. ఇక సీనియర్లు, యువ లీడర్లను మరో భయం పట్టుకుంది. అదే వైఎస్ జగన్. అధికారంలో ఉండగా వైఎస్ జగన్ ను ఆడుకున్న నేతల్లో కొందరి పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. అవినీతి ఆరోపణలు, ఆరెస్టులు, జైళ్లు, విచారణలు అంటూ భయానంకంగా ఉంది సిట్యుయేషన్. గత ప్రభుత్వం చేసిన ఏ చిన్న అవినీతినీ వదిలేది లేదని, పట్టి బయటికి లాగుతామని శపథం చేశారు వైఎస్ జగన్.
అదే సగం మంది తెలుగుదేశం లీడర్లను నోరెత్తకుండా చేస్తోంది. ఇవన్నీ చాలవనట్టు చంద్రబాబు ఇంకా పాత తరహా రాజకీయాలనే ఫాలో అవుతుండటం కూడ పార్టీని వెనుకబాటుకు గురిచేస్తోంది. జనంలో అవగాహన స్థాయి పెరిగింది. ఆధారాలు లేనిదే దేన్నీ నమ్మడంలేదు. అలాంటిది కేవలం నోటి మాటలతో నెట్టుకు రావాలని చంద్రబాబుగారు చేసే ప్రతి ప్రయత్నం విఫలయత్నంగానే మిగిలిపోతున్నాయి. ఇదే పరిస్థితి ఇంకో రెండేళ్లు కొనసాగితే టీడీపీ కి భవిష్యత్తు ఇంపాజిబుల్. కాబట్టి చంద్రబాబుగారు మెలుకుని పార్టీ వేగంగా పుంజుకునే రీతిలో కార్యాచరణ రూపొందించుకోవడం అత్యవసరం.