40 ఏళ్ళ రాజకీయ జీవితంలో నమ్మిన వాళ్లను నట్టేట ముంచడం తప్ప తాను మునగలేదు చంద్రబాబు నాయుడు. అవసరమైనప్పుడు పబ్బం గడుపుకుని అవసరం తీరాక పక్కన పెట్టడం అయన నైజం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఎత్తుగడలకు, రాజకీయాలకు చంద్రబాబు పేటెంట్ హక్కుదారులా కనిపిస్తారు. అలాంటి చరిత్ర కలిగిన బాబుగారు ఈరోజు స్వయంగా మోసపోవడానికి అది కూడ అన్నీ తెలిసి పూర్తి స్పృహతో మోసపోవడానికి సిద్దమయ్యారంటే ఆశ్చర్యం, వింత అనుకోకుండా ఉండలేం. కానీ అదే నిజం అంటున్నారు రాజకీయ వర్గాలు. బీజేపీ చేతిలో మోసపోవడానికి బాబుగారు సిద్దమయ్యారని టాక్. ఈ మోసపోవడం కూడ బీజేపీ కటాక్షం కోసమేనట.
త్వరలో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అందులో వైసీపీకి పోటీగా ఏయే పార్టీలు పోటీ చేస్తాయి అనేది ఇంకా తేలలేదు. అయితే బీజేపీ మాత్రం తప్పకుండా బరిలో నిలుస్తుందని అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇక విషయం తేల్చాల్సిందల్లా టీడీపీనే. అయితే టీడీపీకి ఈ ఎన్నికల మీద నమ్మకం లేదట. అసలే వైసీపీ సిట్టింగ్ స్థానం, సానుభూతి కూడ బలంగా వర్కవుట్ అవుతుంది. పైపెచ్చు ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే ఒక్కరు కూడ లేరు. అసలు ఓడిపోయే స్థానానికి పోటీ ఎందుకు, బరిలోకి దిగి పరువు, డబ్బు నష్టపోవడం ఎందుకని టీడీపీ శ్రేణులు అంటున్నాయట.
అదీకాక టీడీపీకి సరైన అభ్యర్థి దొరకడం లేదు. ఇవన్నీ ఆలోచించిన బాబుగారు తాము పోటీకి వెళ్లకుండా బీజేపీకి పరోక్షంగా మద్దతిచ్చి గెలిపిస్తే జగన్ ను దెబ్బకొట్టినట్టు ఉంటుందని భావిస్తున్నారట. ఈ ఆలోచన బాగానే ఉన్నా అసలు టీడీపీ మద్దతును బీజేపీ అధికారికంగా అంగీకరించే ప్రసక్తే లేదు. అలాగని బాబు తన శక్తులను పరోక్షంగా వాడి తమ గెలుపుకు కృషి చేస్తుంటే వద్దని కూడ అనరు. లోపల సంబరపడుతూ మౌనంగానే ఉండిపోతారు. ఒకవేళ అన్నీ కలిసొచ్చి జగన్ మీద గెలిస్తే మాత్రం అది పూర్తిగా తన గొప్పేనని అంటారే తప్ప బాబు సహకరించారని ఒప్పుకుంటారా అంటే ససేమిరా ఒప్పుకోరు. బాబుగారు బాకాలు పెట్టి నమ్మండి, బీజేపీ గెలిచింది మావల్లే అన్నా కూడ ఒప్పుకోరు. పక్కరు తోసేస్తారు. ఇది బాబుకు కూడ బాగా తెలుసు. కానీ జగన్ మీద పంతంతో మోసపోవడానికి కూడ రెడీ అయ్యారు.