రాష్ట్రంలో అన్ని పరిస్థితులు అనుకూలించి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఏం జరుగుతుంది, టీడీపీ పెట్టుకున్న ఆశలు నెరవేరతాయా, ఆ పార్టీ గ్రాఫ్ పెరుగుతుందా ఇప్పుడు ఈ ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి. స్థానిక ఎన్నికలు గత మార్చిలోనే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ, తర్వాత పరిణామాల నేపథ్యంలో వాయిదాపడడం తెలిసిందే. అయితే, ఇప్పుడు మరోసారి షెడ్యూల్ రావడం, ప్రధానంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పట్టుదలతో ఉండటంతో రాష్ట్రంలో పరిస్థితులు ఆసక్తిదాయకంగా మారాయి.
గత ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఇప్పుడు పుంజుకునేందుకు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి, పార్టీ దూకుడు ప్రదర్శించి, సాధ్యమైనన్ని పంచాయతీల్లో పాగా వేయాలనేది చంద్రబాబు ప్లాన్. ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిందేనని టీడీపీ చెప్తుంది. అలాగే టీడీపీ నేతలు స్థానిక ఎన్నికలపై జగన్ సర్కారు భయపడుతోందని అంటున్నారు.
ఎన్నికలు జరిగితే టీడీపీ పుంజుకుంటుందా అనేది అసలు ప్రశ్న. ప్రస్తుతం టీడీపీ గ్రాఫ్ ఆశించిన విధంగా పుంజుకోలేదన్నది వాస్తవం. చంద్రబాబు ప్రకటనలు.. లేదా పార్టీలోని ఒకరిద్దరు నాయకులు చేస్తున్న హడావుడి తప్ప క్షేత్రస్థాయిలో పార్టీ పుంజుకోలేదు. అలాగే గత ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులు గెలిచిన నాయకుల్లో చాలా మంది సైలెంట్‌గా ఉన్నారు. ఇక, అధికార పార్టీ విషయానికి వస్తే.. జగన్‌పై సానుభూతి ఇంకా కొనసాగుతోంది. జగన్ ప్రభుత్వం తమకు ఏదో చేయాలని ఆశిస్తోందని.. అయితే.. కోర్టుల ద్వారా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయనే వాదనను ప్రభుత్వం బలంగా తీసుకువెళ్లింది. గెలుపుపై ఆశల్లేకే చంద్రబాబు రోజుకో కొత్త డ్రామాకు తెరలేపుతోన్న పరిస్థితి. పైగా పింఛన్లను పెంచడంతోపాటు ఇళ్ల పంపిణీ, అమ్మ ఒడి, రైతు భరోసా.. సహా పలు కీలక పథకాలు బాగానే అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఆశలు అంత తేలికగా నెరవేరేలా కనిపించడం లేదని అంటున్నారు, అయితే ఏ చిన్న అవకాశం వచ్చినా చంద్రబాబు పరిస్థితిని తారుమారు చేయగలరు. చూడాలి ఏమౌతుందో