చంద్రబాబులో కడప టెన్షన్

ముఖ్యమంత్రి చంద్రబాబుకు కడప టెన్షన్ పట్టుకుంది. ఉన్న ఆ ఒక్కటి ఉంటుందా , 2019లో అదీ వూడుతుందా అనేదే ఆ టెన్షన్. 2014 ఎన్నికల్లో కడప జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చింది ఒకే ఒక్క సీటు. ఈ సారి దాన్నయినా కాపాడుకోవాలన్నది ఆయన తాపత్రయం. వైసిపి నుంచి కడప జిల్లాను లాక్కోవాలన్నది ఆయన లక్ష్యం అట. అయితే, ఇపుడది మారిపోయిందని,జిల్లాలో ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత పెరిగిపోయిందని, ముఖ్యంగా యువకుల్లో బాగా కోపం ఉందని తెలిసి, ఉన్న రాజంపేట సీటును కాపాడుకునేందుకు కృషి ముమ్మరం చేస్తున్నారని టిడిపిలో వినబడుతూ ఉంది. ఈ టెన్షన్ లో భాగంగా, జగన్ ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నపుడు, ముఖ్యమంత్రి ఈ నెెల 17,18 తేదీలలో కడప జిల్లాకు వస్తున్నారు.

2014లో టిడిపికి వచ్చింది ఒక్క రాజంపేట సీటు(మేడా మల్లికార్జున్ రెడ్డి) మాత్రమే. 2018 నాటి కి ఈ సీట్లు మూడయ్యాయి. కడప జిల్లాని టిడిపి వశపర్చుకుంటున్నదని ఈ పిరాయింపులతో పేపర్లలో పెద్ద పెద్ద వార్తలొచ్చాయి. ఈ బలం ఎలా పెరిగింది? ఫిరాయంపుల ద్వారా. 2016లో జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తర్వాత బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు వైసిపి వదలిపెట్టి పాతపాటే పాడుతూ , అదే ‘నియోజకవర్గం అభివృద్ది’ , టిడిపిలో చేరిపోయారు. టిడిపి ఇలా బలగం పెరిగిందే తప్ప, జనంలో పట్టుసాధించలేకపోతున్నామని, ఈ ఫిరాయింపుల హైప్  పాలపొంగులా  పడిపోయిందని, చంద్రబాబులో టెన్షన్ పెరిగేందుకు ఇదే కారణమని చెబుతున్నారు. అందుకే ఇక కడప జిల్లా మీద కాన్సంట్రేట్ చేయాలని నిర్ణయించి, ఈ పర్యటన ఖరారు చేసుకున్నారని తెలిసింది.

గత పర్యటనలు చూస్తే కడప జిల్లా టెన్షన్ బాగా అర్థమవుతుంది. ఆయన, కుమారుడు లోకేశ్ చాలా సార్లు ఈ జిల్లాలో పర్యటించి బేరసారాలు నిర్వహించారు. దీని ఫలితంగానే ఫిరాయింపులు. ఫిరాయింపుల ద్వారా ప్రజల్లో మార్పు రాలేదని, జిల్లా ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉందని, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ గురించి తెలుగుదేశమే అడ్డుకుంటున్నదన్న అనుమానం ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలు అందాయని చెబుతారు.

దీనితో ఆయన రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ చేత ఆమరణ నిరాహార దీక్ష చేయించి కడప మీద తనకు చాలా అభిమానం ఉందని, కడప ఉక్కుకోసం త్యాగమయినా చేస్తామని ఒక బిల్డప్ ఇచ్చారు. అదీ కూడా చాల లేదు. ఎందుకంటే, గత నాలుగేళ్లుగా కడప ఉక్కు గురించి ఉద్యమం సాగుతున్నపుడు టిడిపి నేతలెవరూ పాల్గొనలేదు. ఒక్క ప్రకటనా రాలేదు.

ఎన్నికలు దగ్గిర పడుతున్నందున ప్రజలలో ఏదో నమ్మకం కల్గించేందుకు ముఖ్యమంత్రి కడప జిల్లాకు రెండు రోజుల పర్యటనకొస్తున్నారు. ఆగస్టు 17న బద్వే ల్ లో కొస్తున్నారు. బద్వేల్ ఆయన ఉదయం గ్రామదర్శిని లో పాల్గొంటారు. మధ్యాహ్నం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడ రు.24 కోట్లతో 880 ఇళ్లు నిర్మించే గృహనిర్మాణ పథకానికి భూమి పూజ చేస్తారు. తర్వాత కడప పట్టణానికి చేరుకుంటారు. కడప లో టిడిపి అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి సొంత డబ్బులో ఏర్పాటు చేస్తున్న సిసి కెమెరా ఏర్పాటును ప్రారంభిస్తారు. ఎన్టీయార్ క్యాంటీన్ కూడా భూమి పూజచేస్తారు ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు. తర్వాత పార్టీ నేతలతో సమావేశమవుతారు. ఆగస్టు 18న కడప పట్టణం కార్యక్రమాలలో పాల్గొంటారు.

ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ వారానికొకసారి అమరావతిలో విజయవాడలో మాట్లాడుతూ ఐటి కంపెనీలు అమరావతిలో, విశాఖ లో వస్తున్నాయని, అక్కడలక్ష ఉద్యోగాలొస్తున్నాయని తెగ చెబుతున్నారు. ఒక్కసారి కూడా ‘ఇదిగోకడపలో స్టీల్ ప్లాంట్ వస్తున్నది, అక్కడ స్థానికులకు, నిరుద్యోగల యువకులకు 30 వేల ఉద్యోగాలొస్తాయని ఒక్క మాట కూడా చెప్పడం లేదు. దీనర్థం ఏమిటి, కడప జిల్లా ఉక్కు వాళ్ల అజండాలో లేదు అనేగా,’ కడప విశ్వవిద్యాలం విద్యార్థి నాయకుడు ఎంఎం రెడ్డి అంటున్నారు.

వైసిపి ఎమ్మెల్యే ఫిరాయింపుల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్ వివేకానందరెడ్డి ని ఓడించి టిడిపి బిటెక్ రవి ఎమ్మెల్సీగా గెల్చాడు. ఫిరాయింపులు సాగుతున్నపుడు, ఇంక ప్రతిపక్ష పార్టీ పని అయిపోయిందని, టిడిపి కడప జిల్లాను కైవసం చేసుకుంటుందనే ధీమా టిడిపి కార్యకర్తల్లో ఉండింది. అదే విధంగా వైసిపి కార్యకర్తల్లో కొంత నిరుత్సాహం కల్గించిన మాట కూడా నిజమే. అయితే, అదే క్రమేణా తగ్గిపోయింది. చంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్న అభివృద్ధిలో గాని, ఇతర కార్యక్రమాల్లో గాని కడప జిల్లా పేరే వినిపించదు. ముఖ్యంగా కడప ఉక్కు గురించి ముఖ్యమంత్రి ఎపుడూ మాట్లాడలేదు. ఇవన్నీ టిడిపికి బలం చేకూర్చి ఉండవచ్చుగాని, ప్రజలకు తెచ్చిందేమీ లేదు. అందువల్ల టిడిపిలో మళ్లీ 2014 నాటి నిరుత్సాహం మొదలయింది.

 

ఈ నేపథ్యంలో తాను జిల్లా కు చాలా చేశానని, ఇంకా చేస్తానని చెప్పేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 17, 18 తేదీల్లో ఆ జిల్లాలో ఆయ న పర్యటిస్తున్నారు.

ఆయన ఇపుడు రాయలసీమకు కృష్ణా జిలాలొస్తున్నాయని, ఉక్కు ఫ్యాక్టరీ తెస్తానని హామీ ఇవ్వబోతున్నారు.