నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడుగారు తన బలం మీద కంటే ప్రత్యర్థుల బలహీనతలు మీదే ఎక్కువ ఆధారపడ్డారని చెప్పుకోవాలి. ఏ ఎన్నికల్లోనూ ప్రదర్శించడానికి చంద్రబాబు దగ్గర బలాలు ఉండేవి కావు. అందుకే ప్రత్యర్థుల లొసుగులు బయటికి లాగి వాటిని హైలెట్ చేసి గట్టెక్కేవారు. ప్రచారం అంటే అలాంటిలాంటి ప్రచారం కాదు చీమను కాస్త ఏనుగును చేసి చూపించే ప్రచారం. ఆయనకు అండగా ఉన్న ఎల్లో మీడియా ఈ దుష్ట ప్రచారంలో కీ రోల్ పోషిస్తూ వచ్చింది. చెప్పడానికి బాబుగారికి నిజమైన గొప్పలంటూ ఏమీ లేవు కాబట్టి పత్రికల్ని, ఛానెళ్లను ప్రత్యర్థి పార్టీల మీద బురద చల్లడానికే ఉపయోగించేవారు.
ఇన్నాళ్లు పార్టీలు, నేతల వరకే పరిమితమైన ఆయన దుష్ట రాజకీయం ఇప్పుడు వ్యవస్థల వైపుకు మళ్లింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని, చంద్రబాబుతో కుమ్మక్కై తన ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పులు వచ్చేలా కోర్టు బెంచులను మేనేజ్ చేస్తున్నారని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ లేఖ ఎంతవరకు సమంజసం అనేది రాష్ట్రపతి తెలుస్తారు. అసలు జగన్ న్యాయవ్యవస్థ మీద ఇలా ఆరోపణలకు దిగడం తప్పా ఒప్పా అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ ఈలోపు చంద్రబాబు రాజకీయం మొదలెట్టేశారు.
అది కూడ ఎన్వీ రమణను అడ్డంపెట్టుకుని. ఎన్వీ రమణ ఒక తెలుగువారని, ఆయన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే తెలుగువారికి గర్వకారణమని అన్నారు. అంతవరకూ బాగానే ఉన్నా ఆతర్వాతే తన వక్ర భాష్యం స్టార్ట్ చేశారు. తెలుగువారైన ఎన్వీ రమణను సీజీఐ కాకుండా వైఎస్ జగన్ కుట్ర చేస్తున్నారని అందుకే ఆయన మీద పిర్యాదులు చేస్తున్నారని కొత్త సింపతీ డ్రామా స్టార్ట్ చేశారు. నిజానికి తెలుగువారైన ఎన్వీ రమణ సీజేఐ అయితే తెలుగు రాష్ట్రాలకు, తెలుగు ప్రజలకు వచ్చే ప్రత్యేక ప్రయోజనాలు ఏమీ ఉండవు. గతంలో తెలుగువారు సీజేఐగా పదవీ బాధ్యతలు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి కూడ.
అలాంటప్పుడు చంద్రబాబు ఎన్వీ రమణ తెలుగు జాతికి చెందిన వ్యక్తని నొక్కి చెబుతూ ఆయన్ను సీజేఐ కాకుండా జగన్ అడ్డుకుంటున్నారని ప్రచారం చేయడం ఎంతవరకు సబబో ఆయనే ఆలోచించుకోవాలి. ఈ ప్రచారం చూసిన జనం మాత్రం ఈ దుష్ట రాజకీయం వలన ఏమీ సాధించలేరని పెదవి విరుస్తున్నారు.