వయసు మీద పడుతుండడం వల్ల మాట తడబడుతోందా.? లేదంటే, గెలిచే అవకాశం లేదన్న భయంతో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని స్థితిలో వున్నారా.? తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి వ్యవహార శైలి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో.. అందునా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
ఇటీవల చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి వచ్చారు. బీజేపీ అగ్ర నేతలతో మంతనాలు కూడా జరిపారు.. అదీ, ఎన్టీయార్ స్మారక నాణెం ఆవిష్కరణ నిమిత్తం.. ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో. ఇక్కడే, పొత్తుల చర్చలూ జరిగాయట. కానీ, అవి సత్ఫలితాలనివ్వలేదనే ప్రచారమైతే జరుగుతోంది.
తాజాగా, రాష్ట్ర రాజధాని పోలవరం.. అంటూ హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ఏదో మాట తడబాటు అయి వుంటుందిలే.. అని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ, చాలామంది మాత్రం, ఈ వ్యాఖ్యలు చంద్రబాబు మైండ్ సెట్‌ని తెలియజేస్తున్నాయని విశ్లేషిస్తున్నారు.
సరే, రాజకీయాల్లో ఎవరి మాటైనా తడబడొచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, గతంలో దిశ ఘటన గురించి స్పందిస్తూ, టోల్ గేట్ ఫీజు కట్టడానికి బైక్ ఆపిన అమ్మాయి.. అంటూ అర్థం పర్థం లేని వ్యాఖ్యలు అసెంబ్లీ సాక్షిగానే చేసేశారు. ఇలాంటి రాజకీయాల్లో మామూలే. సమాచార లోపం కావొచ్చు, అనుకోకుండా జరిగిన పొరపాట్లు కూడా అయి వుండొచ్చు.
చంద్రబాబు విషయంలో అలా కాదు. మొబైల్ ఫోన్ కనిపెట్టిందీ, కంప్యూటర్ కనిపెట్టిందీ తానే.. అన్నట్లు వ్యవహరిస్తుంటారు. అలాంటి విపరీత వ్యాఖ్యలు ఈ మధ్య ఎక్కువైపోయాయ్. అదే అసలు సమస్య. చంద్రబాబు తీరుని, టీడీపీ నేతలే సమర్థించలేకపోతున్నారు.
ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ మాత్రమే.. అన్న సంకేతం బీజేపీ నుంచి టీడీపీకి వచ్చిందనీ, అందుకే చంద్రబాబు ఇలా తడబడుతున్నారన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన. అంతేనా.? నమ్మొచ్చా.?