కుప్పం కొంపముంచుతుందేమో… బాబు కీలక నిర్ణయం!

జీవితం అంతా ఎలా బ్రతికినా.. ఎన్ని కష్టాలు పడినా.. ఎన్ని అవమానాలు పడినా.. చరమాకంలో మాత్రం తృప్తిగా గడపాలని. రిటైర్మెంట్ లైఫ్ ప్రశాంతంగా గడిపితే అదే మనిషి జన్మకు సార్ధకత అని చాలా మంది భావిస్తుంటారు. దీనికి రాజకీయ నాయకులు కూడా అతీతం కాదు!

అవును… ఉదాహరణకు చంద్రబాబునే తీసుకుంటే చంద్రగిరి నుంచి వచ్చేసిన తర్వాత కుప్పంలో చంద్రబాబు సుమారు 7సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక వయసు పైబడింది. ఏడున్నర దశాబ్ధాలు పైబడింది. ఇవే చివరి ఎన్నికలు అనే సంకేతాలు ఇప్పటికే చంద్రబాబు ఇచ్చారు.

ఈ పరిస్థితుల్లో చంద్రబాబును కుప్పంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఓడించాలని జగన్ కంకణం కట్టుకున్నారు. కుప్పంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. స్పెషల్ టీం ను రంగంలోకి దింపారని తెలుస్తోంది. కుప్పంలో వైసీపీ జెండా ఎగరేసే బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి అప్పగించారు.

మంత్రి పెద్దిరెడ్డి కూడా ఇప్పటికే పలుదఫాలు కుప్పంలో సమావేసాలు పెట్టారు.. పర్యటించారు. ఇందులో భాగంగా తాజాగా నాలుగురోజులపాటు కుప్పంలో సుడిగాలిపర్యటన చేపట్టారు. భారీగా చేరికలు జరిగాయని చెబుతున్నారు. ఇదే సమయంలో ఇప్పటివరకూ ఉన్న సుమారు 40వేళ నకిలీ ఓట్లను గుర్తించినట్లు తెలిపారు.

దీంతో చంద్రబాబు రంగంలోకి దిగారు. వరుసగా ఏడుసార్లు గెలిచినా గెలుపు కోసం పెద్దగా ఏనాడూ శ్రమించాల్సిన అవ్సరం లేని చంద్రబాబు… ఇప్పుడు కుప్పంలో చమటోడ్చబోతున్నారు! కుప్పం నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా రెండు పార్టీ కమిటీల్ని నియమించారు. ఇందులో ఒకటి టీడీపీ విస్తరణ విభాగం కాగా మరొకటి కార్యకర్తల సంక్షేమ విభాగం.

ఈ రెండు కమిటీలూ టీడీపీ కోణంలో చాలా ముఖ్యమైనవి. కారణం… ఇప్పటికే టీడీపీ కార్యకర్తలు పలువురిని వైసీపీలోకి ఆకర్షించే ప్రయత్నాలు సాగుతున్న వేళ చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్న బీఆర్ సురేష్ బాబును.. దీంతో పాటు కుప్పంలో టీడీపీ విస్తరణ విభాగం కన్వీనర్ గా కూడా నియమించారు.

అదేవిధంగా… డీఎస్ త్రిలోక్ ను కుప్పం నియోజకవర్గం పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగం కన్వీనర్ గా నియమించారు. అలాగే కుప్పం మండలానికి చెందిన పార్టీ నేత మణిని రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించారు. మరోవైపు రామకుప్పం మండలానికి చెందిన డాక్టర్ గిరిబాబు నాయక్ ను ఐటీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఇదే క్రమంలో కుప్పంలో టీడీపీ విస్తరణ విభాగం, కార్యకర్తల సంక్షేమ విభాగంలో 9 మంది చొప్పున సభ్యుల్ని కూడా నియమిస్తూ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ విస్తరణ విభాగం… పార్టీలో కొత్తగా చేరే వారిని ఆహ్వానించి చేరికలు చూస్తుంది. అలాగే కార్యకర్తల విభాగం… పార్టీలో కార్యకర్తల్ని కాపాడుకోవడంతో పాటు వారి బాగోగులు చూసేలా పనిచేస్తుంది.

ఈ రేంజ్ లో కుప్పంపై చంద్రబాబు శ్రద్ధపెట్టారు. ఒకపక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈసారి కుప్పం నియోజకవర్గాన్ని జగన్ కు గిఫ్ట్ ఇవ్వాలని బలంగా ఫిక్సయ్యారని కథనాలొస్తున్న వేళ… చంద్రబాబు మనసంతా కుప్పంపై పెట్టారని అంటున్నారు.