ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు వేసుకున్న పెద్ద ప్లాం సరిగా వర్కవుట్ కావట్లేదు. ఓటమి తర్వాత బాగా అంతర్మథనం చేసుకున్న ఆయన బీజేపీతో చేతులు కలిపితే మంచిదని నిర్ణయించుకున్నారు. కానీ ఆ ప్రయత్నంలో వేసే ప్రతి అడుగు ఆయన్ను వెనక్కు లాగుతోంది. రాష్ట్రంలో అధికార పక్షాన్ని అడ్డుకోలేక నానా అవస్థలు పడుతుండగా బీజేపీ దారిదాపుల్లోకి కూడా రానివ్వట్లేదు. మరోవైపు పార్టీ పెద్ద లీడర్లంతా వైసీపీ చేతిలో నలిగిపోతున్నారు. జేసీ, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, చింతమనేని ప్రభాకర్, గంటా, వెలగపూడి లాంటి వారంతా జగన్ వేడికి విలవిల్లాడారు. ఇంకా కొందరు లైన్లో ఉన్నారు. ఇంకోవైపు ఆడుకుంటారనుకున్న బీజేపీ కన్నెత్తి చూడట్లేదు.
బీజేపీకి రాష్ట్రంలో ముఖ్య నేతలుగా వ్యవహరిస్తున్న జీవీఎల్ నరసింహరావు, సునీల్ దియోధర్ చంద్రబాబును బీజేపీ చెంతకు చేరకుండా చేస్తున్నారు. వాళ్ళు అడ్డుపడుతుండబట్టే చంద్రబాబు మాట అమిత్ షా, మోదీల వరకు చేరట్లేదు. బీజేపీలో తనకు అనుకూలమైన వ్యక్తులు అనేకమంది ఉన్నా అధిష్టానాన్ని తనవైపు తిప్పుకోలేకున్నారు. గతంలో టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థంపుచ్చుకోవడం లాంటివి చేసినా బాబుగారికి దక్కిన ప్రయోజనం సున్నా. అందుకే ఇక ఏపీ నాయకుల వైపు నుండి ప్రయత్నం చేస్తే కుదరదని డిసైడ్ అయిన బాబుగారు తెలంగాణ బీజేపీ వైపు నుండి కథ నడుపుతున్నారట.
తెలంగాణ బీజేపీలో తనకు సన్నిహితుడైన ఒక నేత ద్వార బీజేపీ అధిష్టానాన్ని చేరుకోవాలని ఆయన ప్రయత్నాలు స్టార్ట్ చేశారట. అయితే ఆ నేత ఎవరనేది మాత్రం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారట. అధికారం కోల్పోయిన నాటి నుండి బాబుగారు ఢిల్లీ గడప తొక్కింది లేదు. ఒకవేళ తొక్కి ఉన్నా ఒట్టి చేతులతోనే రావాల్సి వచ్చేది. అందుకే అటువైపు చూడలేదు ఆయన. కానీ ఈసారి చేసే ప్రయత్నం మాత్రం తనను నేరుగా బీజేపీ పెద్దల ముందు కూర్చోబెట్టేదిగా ఉండాలని మంత్రాంగాన్ని నడిపిస్తున్నారట ఆయన. ఒకవేళ ఆ ప్రయత్నం ఫలిస్తే చంద్రబాబు త్వరలోనే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కవచ్చని తెలుస్తోంది. మరి బీజేపీతో చేతులు కలపాలనే బాబుగారి ప్రయత్నం ఈసారైనా ముందుకు వెళుతుందో లేదో చూడాలి.