స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ లో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే నిన్నమొన్నటి వరకూ బాబు అరెస్ట్ అక్రమం అని, కక్ష సాధింపు చర్యలో భాగం అని విమర్శలు గుప్పింఛిన టీడీపీ నేతలు ఇప్పుడు ఆయనకు ప్రాణహాని ఉందని, అది కూడా దోమల నుంచి ఉందని చెప్పడం గమనార్హం.
ఈ క్రమంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న గంజేటి వీరవెంకట సత్యనారాయణ ఇటీవల టైఫాయిడ్, రక్తపు వాంతులు కావడంతో చికిత్స పొందుతూ, డెంగ్యూ రావడంతో తీవ్ర అస్వస్థతకు గురై కాకినాడ జీజీహెచ్ బుధవారం మృతిచెందారు అనే వార్తను పోస్ట్ చేసిన నారా లోకేష్… చంద్రబాబుపై కూడా ఇలాంటి కుట్రకు ప్లాన్ చేస్తున్నట్లు అనిపిస్తుందని ట్వీట్ చేశారు!
ఇందులో భాగంగా… “సైకో జగన్, చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ చేయించింది జైలులోనే అంతం చేసేందుకే అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోంది. బాబు గారికి జైలులో భద్రత లేదు, విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవడం లేదు. జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగ్యూ బారినపడి మరణించాడు. బాబు గారికి ఇలాగే చేయాలని సైకో కుతంత్రాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబు గారికి ఏం జరిగినా జగన్ దే బాధ్యత” అని ట్విట్టర్ లో సంచలన ఆరోపణలు చేశారు నారా లోకేష్!
దీంతో టీడీపీ నేతలు సరికొత్త రాజకీయానికి తెరలేపుతున్నారా అనే చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది. అయితే ఇప్పటికే ఇలాంటి ఆరోపణలపై స్పందించిన వైసీపీ నేతల్లో.. దోమతెర కొంటాను, ఏసీ కూడా కొనిస్తాను అని ఒకరంటే… చంద్రబాబు చాలా మంది జీవితాలను నాశనం చేశాడు కానీ.. చంద్రబాబుని చంపేవారు ఇంకా పుట్టలేదంటూ మరొకరు వ్యాఖ్యానించారు.
ఈ సమయంలో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. “వైఎస్సార్సీపీ గుర్తు ఫ్యాన్ అయినంత మాత్రాన జైలులో ఫ్యాన్ వాడరాదన్న నియమం ఏమీలేదు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఫ్యాన్ తీసేసి నాకు ఏసీ కావాలని పట్టుబట్టినా జైలు నిబంధనలు అందుకు అనుమతించవు. స్విచ్ వేయకుండా ఫ్యాన్ తిరగడం లేదంటే ఎలా?” అంటూ ట్వీట్ చేశారు.
దీంతో అటు లోకేష్ వ్యక్తం చేసిన ఆందోళనకు సంబంధించిన ట్వీట్.. ఫ్యాన్ గుర్తు వైసీపీది కాబట్టి స్విచ్ ఆన్ చేయనంటే ఎలా అంటూ సాయిరెడ్డి చేసిన ట్వీట్ లు వైరల్ అవుతున్నాయి.
అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ మరణించడంపై జైళ్ల శాఖ డీఐజీ స్పందించారు. “దోపిడీ కేసులో ఈ నెల 6న సత్యనారాయణ జైలుకు వచ్చాడని.. జ్వరం, ప్లేట్ లెట్లు పడిపోవడంతో 7న రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించామని అన్నారు. అనంతరం అత్యవసర వైద్య సహాయం కోసం ఈనెల 19న కాకినాడ జీజీహెచ్ కు తరలించామని అన్నారు. ఈ క్రమంలో డెంగ్యూతో బుధవారం మృతిచెందారని” తెలిపారు.
ఇదే సమయంలో… జైలులో దోమల నివారణకు సంబంధిత శాఖతో కలిసి చర్యలు చేపట్టామని.. రెగ్యులర్ గా ఫాగింగ్ చేస్తున్నామని.. జైలులో దోమల లార్వా ఆనవాళ్లేమీ లేవని జైళ్ల శాఖ డీఐజీ తెలిపారు.