పవన్ పద్మవ్యూహంలో బాబు!

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు చంద్రబాబుకు లైఫ్ & డెత్ ఇష్యూ అనడంలో సందేహం లేదు. 2024 ఎన్నికల్లో గెలిస్తే టీడీపీకి పూర్వ వైభం వస్తుంది. ఓడిపోతే పరిస్థితి ఏమిటన్నది చంద్రబాబు కంటే బాగా ఎవరికీ తెలియక పోవచ్చు. ఈ పరిస్థితుల్లో పవన్ తో పొత్తు బాబుకు అంత అవసరమా అనే కామెంట్లు తాజాగా తెరపైకి వస్తున్నాయి. కారణం.. తాజాగా పవన్ ఇచ్చిన స్టేట్ మెంట్స్!

చంద్రబాబు రాజకీయం గతంలో ఒకలా ఉండేది… పవన్ పరిచయం అని తర్వాత పూర్తి భిన్నంగా మారిపోయింది. ఎప్పుడైతే… “ప్రభుత్వ వ్యతిరేఖ ఓటు చీలనివ్వను” అని పవన్ అన్నారో ఆ పద్మవ్యూహంలో బాబు తెలియకుండానే చిక్కుకుపోయారు. ఫలితంగా పవన్ చుట్టూ తిరిగడం మొదలుపెట్టారు. ఇక్కడ బాబు గ్రహించాల్సిందేమిటంటే… పవన్ కు ఎన్నికలంటే పెద్ద విషయం కాదు!

ఎన్నికల్లో గెలిచినా ఓడినా పవన్ జీవితం ఏమీ మారిపోదు.. జనసేన పరిస్థితి ఇంతకంటే దిగజారిపోదు. కానీ బాబు పరిస్థితి అలా కాదు… టీడీపీకి ఈ ఎన్నికలు అత్యంత కీలకం. టీడీపీని నమ్ముకుని వందల సంఖ్యలో నాయకులు, లక్షల సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు. ఈసారి పరిస్థితి అటో ఇటో అయ్యిందంటే… ఇక సైకిల్ గుర్తు చరిత్రకే పరిమితమైనా ఆశ్చర్యపడనక్కరలేదు! కాబట్టి… బాబు తన పాత స్టైల్లో… అభివృద్ధి కావాలి కనుక తనను గెలిపించాలని అడగాలి. అభివృద్ధి కోసం అందరం కలుస్తున్నాం అని చెప్పాలి.

కానీ.. పవన్ చెబుతున్న మాట… జగన్ ని ఓడించడానికి బీజేపీ – టీడీపీ – జనసేన – సీపీఎం – సీపీఐ… ఇలా అందరూ కలిసిపోవాలని. దీంతో ఇది పరోక్షంగా జగన్ కు ప్లస్ అవుతుంది. ఒక్కడి ఓడించడానికి ఇంతమంది కలవాలా.. మరీ ఇంతమంది కలిసి ఓడించేటంత చెడ్డగా జగన్ పాలన ఏమీ లేదు కదా అనే వాదన కూడా తెరపైకి వస్తుంది.

తాము గెలవడం వల్ల ఇప్పటికంటే ఏమి బెటర్ గా ఉంటుందో చెప్పి ఓట్లు అడగాల్సిన పవన్… జగన్ ని ఓడించడం కోసం అందరూ తమకు ఓటెయ్యాలని కోరుతున్నారు. చంద్రబాబేమో… తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్న పథకాలేవీ తొలగించమని చెబుతున్నారు. దీంతో… ఇటు తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యే పరిస్థితులు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటూ పవన్ వేసిన పద్మవ్యూహంలో చిక్కుకున్న బాబు… తన పాత పద్దతి ప్రకారం.. అభివృద్ధిని చూపిస్తూ.. ఆ మేరకు హామీ ఇస్తూ ఓట్లు అడగాలే తప్ప.. ఓడిపోతే పార్టీ పోతుంది కాబట్టి – జగన్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ ఓడించాలని.. కాబట్టి మాకు ఓటెయ్యండని పవన్ పద్దతిలో ముందుకుపోకూడదు అని గ్రహించాలి.

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. పవన్ ఇప్పుడు బాబుకు భారంగా మారడమే కాకుండా.. మరికొంత అదనపు భారాన్ని కూడా తీసుకురాబోతున్నారు. అదే… ఎన్నికల ఖర్చు. కారణం… సీఎం సీటు త్యాంగం చేశారు కాబట్టి… జనసేన ఎమ్మెల్యే అభ్యర్థుల ఖర్చులు కూడా బాబు చూసుకోవాల్సిన పరిస్థితి. పవన్ పైసా తీయరు.. అసలు ఎన్నికల్లో డబ్బు పంచే విధానానికి ఆయన వ్యతిరేకం అని కూడా చెప్పి సైడ్ అయిపోతారు. కానీ… ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆ అవకాశం లేదు. సో… బాబుకు ఎటుచూసినా ఇప్పుడు పవన్ భారమే అన్నమాట!

ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏమిటంటే… పవన్ తమతో కలిసి రావాలని కోరుతున్నది నోటా కంటే తక్కువ ఓటు బ్యాంక్ ఉన్న బీజేపీ – సీపీఐ – సీపీఎం లను. ఇక్కడ బీజేపీ నాయకుల సంగతి కాసేపు పక్కనపెడితే… కమ్యునిస్టుల ఖర్చు కూడా బాబే భరించాలి. పైగా… బీజేపీ – కమ్యునిస్టులు కలిసి కనిపిస్తే… అంతకు మించిన రాజకీయ అవకాశవాదం మరొకటి లేదనే విషయం జనాల్లోకి బలంగా వెళ్తుంది. ఫలితంగా జగన్ ని ఓడించాలనే మైకంలో సిద్ధాంతాలను కూడా పక్కనపెట్టేశారనే విమర్శ బలంగా పనిచేస్తుంది.

పైగా…. బీజేపీ – కమ్యునిస్టులకు ఇచ్చిన సీట్లను బాబు & కో వదిలేసుకోవచ్చు కూడా. కారణం… ఇన్ని పార్టీలు కలిసిపోయినా… ఎవరు బడితే వారు ఎమ్మెల్యే అభ్యర్థులైపోయినా… అక్కడున్నది జగన్. ఆయన లెక్కలు ఆయనకుంటాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీకి జనసేనే భారం అనుకుంటుంటే… వీళ్లంతా ఎందుకు. పనికిమాలిన భయం తాలుకు ఆలోచనలు కాకపోతే.. ఇది తుత్తర ఆలోచన కాదా? బాబు గ్రహించుకోవాలి! జనం వివేకాన్ని తక్కువ అంచనా వేయకూడదు. 2019 ఎన్నికల సమయంలో పంచిన పసుపూ కుంకుమ ఇచ్చిన అనుభవాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి.