స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. గత ముప్పయి మూడు రోజులుగా చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ లోనే ఉన్నారు. ఇదిలా ఉంటే నాటి నుంచి కేవలం క్వాష్ పిటిషన్ మీదనే బాబు తరఫున న్యాయవాదులు వివిధ కోర్టులలో పోరాడుతున్నారు. ఈ సమయంలో చంద్రబాబుకు అస్వస్థత చేసింది. దీనిపై హెల్త్ బులిటెన్ విడుదలయ్యింది.
ఏపీలో అత్యంత వేడిమి గలిగిన ప్రాంతాలలో రాజమండ్రి ఒకటని అంటారు. పైగా వాతావరణంలో తేమ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే చమటలు ఎక్కువగా పడుతుంటడంవల్ల తొందరగా డీహైడ్రేషన్ కు గురయ్యే ఛాన్స్ ఉంటుంది. పైగా ఈ ఏడాది మొత్తం వేసవి కాలంగానే ఉన్నట్లుగా ఉంది. దాంతో సెప్టెంబర్, అక్టోబర్ నెలలలో సైతం ఉష్ణోగ్రతలు గట్టిగానే ఉన్నాయి. ఈ నేపధ్యంలో చంద్రబాబు జైలులో విపరీతమైన ఉక్కబోతతో డీ హైడ్రేషన్ కి గురి అవుతున్నారని వార్తలు వచ్చాయి.
కొన్ని రోజులుగా ఎండ ఎక్కువగా ఉండటం, ఉక్కపోత కారణంగా ఆయన స్కిన్ అలర్జీతో ఇబ్బందులు పడుతున్నట్టు తెలిసింది. ఇదే విషయాన్ని చంద్రబాబు జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన జైలు అధికారులు రాజమండ్రి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ సూర్యప్రభకి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన సూపరింటెండెంట్ ఇద్దరు చర్మ సంబంధిత వ్యాధి నిపుణులను కేటాయించారు.
దీంతో… అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.సూర్యనారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సీహెచ్. సునీతాదేవి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేపట్టారు. అనంతరం… వైద్యులు పరీక్షలు చేసి మందులను సూచించారని, వాటిని చంద్రబాబుకు అందిస్తామని డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ వెల్లడించారు. ఈ క్రమంలో గురువారం రాత్రి హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు.
హెల్త్ బులిటెన్ వివరాల ప్రకారం..:
బీపీ: 140/80
టెంపరేచర్: సాధారణం
పల్స్: 87
ఎస్పీఓ2: 97
హార్ట్: ఎస్1 ఎస్2
లంగ్స్: క్లియర్
ఫిజికల్ యాక్టివిటీ: గుడ్