చంద్ర‌బాబుకు కర్నూల్ షాక్

ఇప్ప‌టి వ‌రకూ చంద్ర‌బాబునాయుడుకు ఏ జిల్లా నేత‌లు కూడా ఇంత స్ధాయిలో బిగ్ షాక్ ఇచ్చుండ‌రు. ఎల‌క్ష‌న్ స‌మ‌యంలో అందులోను స్వ‌యంగా చంద్ర‌బాబే జిల్లాకు వ‌చ్చిన నేప‌ధ్యంలో షాక్ ఇవ్వ‌టం జిల్లాలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇంత‌కీ జిల్లా నేత‌లు ఏ విధంగా షాక్ ఇచ్చారంటే చంద్ర‌బాబు పాల్గొన్న కార్య‌క్ర‌మానికి గైర్హాజ‌ర‌వ్వటం అంటే షాక్ ఇచ్చిన‌ట్లే క‌దా ?

ఇంత‌కీ విష‌యం ఏమిటంటే, జ‌ల‌సిరికి హార‌తి అనే డ‌బ్బు వృధాగా ఖ‌ర్చ‌య్యే దండ‌గ‌మారి కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు చంద్ర‌బాబు జిల్లాలోని శ్రీ‌శైలంకు వ‌చ్చారు. ఆ కార్య‌క్ర‌మంలో ప‌లువురు మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధులు, నేత‌లు హాజ‌ర‌య్యారు. అయితే , ఇక్క‌డే ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం జ‌రిగింది. అదేమిటంటే, క‌ర్నూలు ఎంపి బుట్టా రేణుక‌, రాజ్య‌స‌భ ఎంపి టిజి వెంక‌టేష్ హాజ‌రుకాలేదు. అదే విధంగా ఎంఎల్ఏలు బిసి జ‌నార్ధ‌న‌రె్డ్ది, బివి జ‌య‌నాగేశ్వ‌ర్ రెడ్డి, భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి డుమ్మా కొట్టారు. ఎంఎల్సీ, ఏపిఐడిసి ఛైర్మ‌న్, ఉప ముఖ్య‌మంత్రి కెఇ కృష్ణ‌మూర్తి సోద‌రుడు కెఇ ప్ర‌తాప్ కూడా గైర్హాజ‌రయ్యారు. ఒకేసార ఇంత‌మంది ప్ర‌ముఖులు గైర్హాజ‌ర‌వ్వ‌ట‌మంటే మామూలు విష‌యం కాదు.

అయితే, ప్ర‌ముఖుల గైర్హాజ‌రును టిడిపి ఏదో క‌ల‌రింగ్ ఇచ్చి క‌వ‌ర్ చేసుకునేందుకు నానా అవ‌స్త‌లు ప‌డుతోంది. ఎంపిలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీ త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన జ‌ల‌సిరి హార‌తి కార్య‌క్ర‌మంలో పాల్గొన‌టంలో బిజీగా ఉన్న కార‌ణంగా సిఎం కార్య‌క్ర‌మానికి హాజ‌రుకాలేదంటున్నారు. అదే నిజ‌మైతే రాజ్య‌స‌భ స‌భ్యుడు టిజి వెంక‌టేష్, ఎంఎల్సీ కెఇ ప్ర‌తాప్ కు అస‌లు నియోజ‌క‌వ‌ర్గాలే లేవు. మ‌రి వారెందుకు హాజ‌రుకాలేదు ?

ఇక్క‌డ విష‌యం ఏమిటంటే, క‌ర్నూలు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొడుకు టిజి భ‌ర‌త్ ను పోటీ చేయించాల‌ని వెంక‌టేష్ ప్ర‌య‌త్నిస్తున్నారు. అందుకు లోకేష్ అడ్డుగా ఉన్నారు. కాబ‌ట్టి వెంక‌టేష్ హాజ‌రుకాలేదు. ఇక‌, పేరుకు ఉప‌ముఖ్య‌మంత్రే అయినా కృష్ణ‌మూర్తి కి ప్రోటోకాల్ త‌ప్ప ఇంకేమి అంద‌టం లేదు. పార్టీలో, ప్ర‌భుత్వంలో సోద‌రునికి జ‌రుగుతున్న అవ‌మానానికి త‌మ్ముడు ప్ర‌తాప్ మండిపోతున్నారు. అందుక‌ని ప్ర‌తాప్ డుమ్మా కొట్టార‌ట‌. మొత్తానికి ఏదో ఓ కార‌ణంతో కొంద‌రు ప్ర‌జా ప్ర‌తినిధులు చంద్ర‌బాబుకు గ‌ట్టి షాకే ఇచ్చారని జిల్లాలో చ‌ర్చ మొద‌లైంది.

(కోపల్లె ఫణికుమార్)