రాయల్టీ కోరుతున్న చంద్రబాబు.! ఐటీ ఉద్యోగులూ సిద్ధమేనా.?

మీరు సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్నారా.? అయితే, చంద్రబాబు దయతోనే మీరు బతుకుతున్నారు. ఔను, ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే చెప్పారు. తాను ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం వల్లే దేశవిదేశాల్లో యువత ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలూ సంంపాదించుకుంటోందనీ, ఆర్థికంగా బలపడుతున్నారనీ చంద్రబాబు చెప్పుకొచ్చారు. హైద్రాబాద్‌లో ఐటీ అభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషిని కాదనలేం. మరి, చెన్నయ్, బెంగళూరు వంటి నగరాల్లో ఐటీ అభివృద్ధి చెందడానికి కారణమెవరు.? వాళ్ళెవరైనా ఇంతలా డప్పు కొట్టుకుంటున్నారా.? కొట్టుకోరు. కానీ, చంద్రబాబు రూటే సెపరేటు.

పైగా, చంద్రబాబు తనకు రాయల్టీ కట్టాలంటూ ప్రజలకు హుకూం జారీ చేశారు. ‘నాకు మీరంతా రాయల్టీ చెల్లించాలి..’ అని చెప్పి, ‘టీడీపీకి రాయల్టీ చెల్లించాలి’ అంటూ చెప్పుకొచ్చారు. ‘చంద్రబాబుకి చిప్పు దొబ్బింది’ అనే మాట ప్రతిసారీ విపక్షాల నుంచి విమర్శ రూపంలో దూసుకొస్తుంటుంది. నిజమేనేమో అని ఇలాంటి సందర్భాల్లోనే అనిపిస్తుంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగం అభివృద్ధి చెందింది. అది చంద్రబాబు వల్ల కాదు కదా.? అయినా, ఓ మనిషి, ఓ నాయకుడి వల్ల అభివృద్ధి చెందితే రాయల్టీ చెల్లించాలా.? అసలు అతను రాజకీయ నాయకుడు అయ్యిందే ప్రజల వల్ల కదా.? మరి, ప్రజలకు రాజకీయ నాయకులు చెల్లిస్తున్న రాయల్టీ ఏంటి.?

జనం సొమ్ముతో సంక్షేమ పథకాలు అమలు చేసి, సొంత పేర్లు పెట్టుకునే రాజకీయ నాయకులు, చివరికి ఆ ప్రజల నుంచి రాయల్టీ కోరే స్థాయికి దిగజారిపోయారు.