ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవ్వడం.. కూటమి అధికారంలోకి రావడం చక చకా జరిగిపోయాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు.. గడిచిన ఏభై రోజులుగా గత ప్రభుత్వాన్ని విమర్శించే పనిలో ఉండి.. సూపర్ సిక్స్ హామీలను మరిచిపోయినట్లు నటిస్తున్నారనే చర్చ మొదలైంది.
మరోపక్క పవన్ కల్యాణ్ కూడా జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తూ, హామీల ఊసు ఎత్తకుండా అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే… ఏపీలో డబ్బులు లేవు.. చాలా ఇబ్బందులు ఉన్నాయని.. తనకు ఇప్పుడే తెలిసినట్లుగా బీద అరుపులు అరుస్తూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న చంద్రబాబు… ఓ కీలక ఆలోచన చేశారని తెలుస్తోంది.
వాస్తవానికి ఏపీలో రోడ్ల పరిస్థితి విషయంలో గత సర్కార్ పై తీవ్ర విమర్శలు వినిపించిన సంగతి తెలిసిందే. కోవిడ్ కారణంగా సుమారు రెండేళ్ల పాటు రాష్ట్ర ఆదాయానికి పూర్తిగా గండి పడినా సంక్షేమ పథకాలు అమలు చేసిన జగన్… మౌలిక సదుపాయాల కల్పన విషయంలో మాత్రం ఒత్తు అందలేని పరిస్థితి ఎదుర్కొన్నారు.
అయినప్పటికీ 2022 చివర్లో కొన్ని రోడ్లను బాగుచేసినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఆ సంగతి అలా ఉంచితే… ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఓ పక్క సంక్షేమ పథకాల అమలు విషయంలో బాబు ఇప్పటికే లైట్ తీసుకున్నారని అంటున్నారు. పైగా ప్రజలు అర్థం చేసుకోవాలని అప్పీల్ చేస్తున్నారు.
అదంతా ఒకెత్తు అయితే… రోడ్లను బాగుచేసే విషయంలో చంద్రబాబు సరికొత్త ఆలోచన చేశారని తెలుస్తోంది. సీఎంవో నుంచి అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… రోడ్లను బాగు చేసే విషయంలో ప్రభుత్వంపైనే ఆర్థిక భారం పడకుండా.. ఆ భారం ప్రజలపైనే మోపాలని చంద్రబాబు భావిస్తున్నారంట.
ఈ మేరకు ఆయన గ్రామ, మండల స్థాయిలో టోల్ గేట్లు ఏర్పాటు చేయనున్నారని అంటున్నారు. గుంతలు పడిన రోడ్లను బాగుచేయడం కోసం పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) పద్దతిలో రాష్ట్రంలోని రహదారులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారని అంటున్నారు. దీంతో… ఇకపై గ్రామ, మండల స్థాయిల్లోనూ టోల్ గేట్లు దర్శనమిస్తాయని చెబుతున్నారు!
ఈ నిర్ణయం ప్రకారం… ప్రతి పల్లె నుండి మండల కేంద్రానికి, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికీ మధ్య టోల్స్ వసూల్ చేస్తారన్నమాట. అయితే… ఈ విషయంలో బైకులు, స్కూటర్లు, ఆటోలు, ట్రాక్టర్లకు మాత్రం వీటి నుంచి మినహాయింపు ఇవ్వాలని.. మిగిలిన వాహనాలకు మాత్రం టోల్ ఛార్జీలు వసూలు చేయాలని బాబు భావిస్తున్నారని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని తెలుస్తోంది.