ఆంధ్ర ప్రదేశ్: తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు తెలుగు యువత అధ్యక్ష పదవిని చంద్రబాబు భర్తీ చేయలేదు. ఇటీవలే రాష్ట్ర స్థాయి… జిల్లా స్థాయిలో అన్నీ పదవులు భర్తీ చేశాక ఇప్పుడు కీలకమైన తెలుగు యువత అధ్యక్ష పదవిని భర్తీ చేశారు. దేవినేని అవినాష్ ఈ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఏడాదిన్నరనుంచి ఖాళీ గా ఉంది. ఇక ఈ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవిని పరిటాల శ్రీరామ్ కు ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు అనూహ్యంగా ఆయనను పక్కన పెట్టారు. చిత్తూరు జిల్లాకు చెందిన బీసీ నేత జి. శ్రీరామ్ కు ఈ బాధ్యతలను అప్పగించారు.
ఏపీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా జి.శ్రీరామ్ ను నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు తన సొంత జిల్లాకే చెందిన శ్రీరామ్‌కు ఈ కీలక పదవి అప్పగించారు. ఆయన గతంలో మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. ఆయన చేనేత వర్గానికి చెందిన వారు. ఇక ఈ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న శ్రీరామ్‌కు చంద్రబాబు, లోకేష్ పెద్ద షాకే ఇచ్చారని పార్టీలో చర్చ నడుస్తోంది. అసలు లోకేష్‌కే ముందుగా శ్రీరామ్‌కు ఈ పదవి ఇవ్వడం ఇష్టం లేదని అంటున్నారు. బీసీలకు పెద్ద ప్రయార్టీ ఇచ్చే క్రమంలో ఈ శ్రీరామ్‌ను తెరమీదకు తీసుకు వచ్చి… పరిటాల శ్రీరామ్‌కు షాక్ ఇచ్చారని వినబడుతుంది.