చంద్రబాబు ఢిల్లీ రాజకీయం.! పొత్తులు ఖరారైనట్టేనా.?

బీజేపీ అధినాయకత్వం తెలుగుదేశం పార్టీతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగానే వుంది. ఇది బహిరంగ రహస్యం. కానీ, తెలంగాణ బీజేపీ కావొచ్చు, ఏపీ బీజేపీ కావొచ్చు.. టీడీపీతో కలవడానికి ఇష్టంగా లేవు.

అయితే, బీజేపీ జాతీయ నాయకత్వం లెక్కలు వేరే వుంటాయ్. లాభ నష్టాల లెక్కలు పక్కాగా వేసుకునే, పొత్తుల నిర్ణయం తీసుకుంటుంది బీజేపీ జాతీయ నాయకత్వం. ఈ క్రమంలో రాష్ట్ర నాయకత్వాన్ని వెర్రి వెంగళప్పల్ని చేసెయ్యడం బీజేపీ అధినాయకత్వానికి కొత్తేమీ కాదు.

టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళారు. అదీ బీజేపీ జాతీయ నాయకత్వం పిలుపుతోనే. చర్చలు సహృద్భావ వాతావరణంలో జరుగుతున్నాయట. పొత్తు దాదాపు ఖరారైందనే అంటున్నారు. పొత్తు ఖరారైతేనే కదా, ఢిల్లీకి చంద్రబాబుని పిలిచేది. అక్కడ ‘టెర్మ్స్ అండ్ కండిషన్స్’ మీద మాత్రమే చర్చ జరుగుతుంది.

అంటే, బీజేపీకి టీడీపీ ఎలా సహకరిస్తుంది.? టీడీపీకి బీజేపీ ఎలా సాయపడుతుంది.? అన్న అంశాల మీద చర్చ అన్నమాట. ఇంతకీ, జనసేన సంగతేంటి.? కొన్నాళ్ళ క్రితం జనసేనాని ఢిల్లీకి వెళ్ళినప్పుడే, బీజేపీ – టీడీపీ పొత్తుపైనా, బీజేపీ అధినాయకత్వం పవన్ కళ్యాణ్ ముందు కొన్ని ప్రతిపాదనలు వుంచిందట. ఆ వివరాల్ని చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ చేరవేశారనే వాదనలు అప్పట్లో వినిపించాయి. ఆ కండిషన్స్‌కి చంద్రబాబు ఒప్పుకుని, ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళారట.

బీజేపీ, తెలుగు రాష్ట్రాల్లో మెజార్టీ ఎంపీ సీట్లను కోరుకుంటోంది. అదీ అసలు విషయం. టీడీపీ, జనసేన ఈ విషయంలో బీజేపీకి ఎంతవరకు సాయం చేయగలవ్.?