టీడీపీ గెలిచిన పంచాయతీలలో ఓట్ల లెక్కింపును ఇష్టానుసారం మార్చివేసి వైసీపీ ఖాతాలో వేసుకొన్నారని, అధికార పక్ష ఉన్మాదులు… రౌడీల స్వైర విహారాన్ని ఎన్నికల కమిషన్ కూడా ఆపలేకపోయిందని చంద్రబాబు విమర్శించారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు రాత్రిపూట వద్దని, పగలు జరపాలని మేం కోరాం. ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు. లెక్కింపు ప్రక్రియను కెమెరాలతో రికార్డు చేయాలని ఎన్నికల కమిషన్ చెప్పింది. దానిని ఎక్కడా పాటించలేదు. రాత్రిపూట ఓట్ల లెక్కింపు సమయంలో కరెంటు పోయిందనే సాకుతో కొన్నిచోట్ల ఫలితాలు అడ్డగోలుగా మార్చేశారు.
నిబంధనల ప్రకారం రెండు అంకెల్లో మెజారిటీ ఉన్నచోట రీ కౌంటింగ్ అవసరం లేదు. రీ కౌంటింగ్ కూడా ఒకసారి మాత్రమే జరపాలి. కానీ మూడు, నాలుగు సార్లు రీ కౌంటింగ్ జరిపి వైసీపీ గెలిచిందని ప్రకటించేశారు. మూడో విడత ఫలితాల్లో సాయంత్రం ఏడు గంటల వరకూ టీడీపీ ఆధిక్యం ఉందని ప్రభుత్వ అనుకూల టీవీలతో సహా అందరూ చూపించారు. ఆ తర్వాత డ్రామా మొదలైంది. తొమ్మిదిన్నరకు వైసీపీకి కొద్ది ఆధిక్యం చూపించారు. ఆ తర్వాత ఫలితాలను ఏకపక్షంగా మార్చేశారు. టీడీపీ గెలిచిన పంచాయతీల్లో వైసీపీ గెలిచినట్లుగా ఫలితాలను మార్చేశారు’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంచాయతీ ఎన్నికల్లో అర్ధరాత్రి అక్రమాలతో ప్రజాస్వామ్యాన్ని దారుణంగా హతమార్చారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికలను ఒక ఫార్సుగా మార్చారనీ, బెదిరింపులు… దౌర్జన్యాలతో రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశారనీ చంద్రబాబు విమర్శించారు. ‘వలంటీర్లు ప్రతి ఓటర్ వద్దకు వెళ్లి అమ్మ ఒడి, పింఛను, రేషన్ కార్డులు తీసివేస్తామని రౌడీల మాదిరిగా బెదిరించి వైసీపీకి ఓట్లు వేయించారు. విపరీతంగా డబ్బు సంపాదించి ఆ డబ్బును వైసీపీ నేతలు ఈ ఎన్నికల్లో వెదజల్లారు. ఓటుకు రూ.పది వేలు కూడా ఖర్చు చేశారు.
అయినా టీడీపీ అభ్యర్థులు గెలిస్తే ప్రజలపై ప్రతీకారం తీర్చుకోవడం మొదలు పెట్టారు. నరసరావుపేటలో ఇంటి గోడలు కూలగొట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చేపల చెరువులో విషం కలిపారు. పొలాలను తగలబెడుతున్నారు. పోలీస్ స్టేషన్‌కు పిలిపించి బెదిరిస్తున్నారు. అక్రమ కేసులు పెడుతున్నారు. ఇవన్నీ తట్టుకొని టీడీపీ పోరాటం చేస్తోంది. మొదటి విడతలో టీడీపీకి 38 శాతం… రెండో విడతలో 40 శాతం… మూడో విడతలో 42 శాతం పంచాయతీలు ఇచ్చారు. నాలుగో విడతలో కూడా ఆశీర్వదించాలని కోరుతున్నాం’’ అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.