“కంట్రోల్ సి – కంట్రోల్ వి” అంటున్న బాబు… ఇది మాత్రం పీక్స్!

సుమారు నలభై ఏళ్లకు పైగా రాజకీయాలో ఉండటం వల్ల మస్తిష్కంలో మేటర్ తగ్గిపోయిందో, పైబడుతున్న వయసు రీత్యా ఆలోచనలు అడుగంటిపోయాయో తెలియదు కానీ… ప్రస్తుతం ప్రతీ విషయంలోనూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనలనే ఫాలో అవుతూ నేట్టుకొస్తున్నారు చంద్రబాబు! జగన్ ఏ పథకం పెట్టినా, కొత్తగా ఏ వ్యూహరచన చేసినా… వెంటనే నిస్సిగ్గుగా దాన్ని ఫాలో అయిపోతున్నారు టీడీపీ అధినేత. దీంతో… టీడీపీ కార్యకర్తలు “సరుకు అయిపోయిందేమో” అని ఆందోళన చెందుతున్నారు!

అవును.. ఏపీ రాజకీయాలను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి ఒక విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కొంతకాలంగా… వైఎస్ జగన్ పథకాలను గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు చంద్రబాబు. వివిధ పథకాలకు జగన్ పెట్టిన పేర్లను మాత్రం కాస్త అటు ఇటూ మారుస్తున్న బాబు… జగన్ పథకాలను “కాపీ” కొట్టి, ఆయన పార్టీలో “పేస్ట్” చేస్తున్నారు. దీంతో… “జగన్ లేకపోతే మా బాబుగారి పరిస్థితి ఏమైపోయేదో” అని కామెంట్లు పెడుతున్నారు తమ్ముళ్లు.

ఉదాహరణకు… “జగనన్నే మన భరోసా” పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు వైఎస్ జగన్. దీంతో… ఇదే తరహాలో “చంద్రన్నే మన భరోసా” అనే కార్యక్రమం స్టార్ట్ చేశారు చంద్రబాబు. ఇదే క్రమంలో… వైసీపీవాళ్ళు “మా నమ్మకం నువ్వే జగనన్నా” అని ఇంటింటికి స్టిక్కర్లు అంటిస్తుంటే… టీడీపీ వాళ్ళూ సైతం “మా నమ్మకం నువ్వే బాబు” అని స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఆ మధ్య “గడపగడపకు మ‌న ప్రభుత్వం” అని జగన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తే… అదే తరహాలో “ఇంటింటికి టీడీపీ” అనే కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రకటించారు.

ఎలాగూ మొదలుపెట్టాం కదా అనుకున్నారో ఏమో కానీ… ఇలా దాదాపు ప్రజల్లోకి బలంగా వెళ్తున్న జగన్ పథకాలనూ బాబు పేరు మార్చి వాడేసుకుంటున్నారు. ఇక, జగన్ వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తే… దీనిపై చంద్రబాబు చేయని ఆరోపణలేదు. “ఐదు వేల రూపాయల జీతానికి చేసే ఉద్యోగ్యం.. ఏమి ఉద్యోగం ఇది. గోనెసంచులు మోసే ఉద్యోగమా.. ఇళ్లల్లో మగాళ్లు లేనప్పుడు వెళ్లి డిస్టర్బ్ చేసే ఉద్యోగమా.. ఎక్కడికిపోతున్నాం మనం” అని స్పందించారు చంద్రబాబు.

అయితే… తాజాగా ఆ వ్యవస్థ‌ ప్రజల్లో బాగా పాపులరైన విషయం గ్రహించిన బాబు… వెంటనే మాట మార్చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పేసుకున్నారు. ఇదే క్రమంలో… “గృహసారథులు” పేరుతో జగన్ పార్టీలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో వెను వెంటనే చంద్రబాబు కూడా “సాధికార సారథులు” అని పేరుమార్చి ప్రకటించేశారు.

ఇలా ప్రతీ పథకం విషయంలోనూ జగన్ నే ఫాలో అవుతున్న చంద్రబాబు… తాను అధికారంలోకి వస్తే జగన్ పెట్టిన ప్రతీ సంక్షేమ పథకాన్ని కంటిన్యూ చేస్తానని చెప్పడం పీక్స్!