శపథం ఫలితం తేడా కొడితే… సభకు నమస్కారమేనా?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఈసారి జరిగినవి ఎన్నికలు కావు.. యుద్ధమే జరిగిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఫలితాలు వెలువడిన అనంతరం ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకోబోయే పరిణామాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగా… ఎవరు ఓడినా వారు అసెంబ్లీకి వస్తారా.. వచ్చి ఉండగలరా అని!

అవును… వాస్తవానికి అసెంబ్లీలో జరిగిన పలు ఘటనలవల్ల కొంతమంది నేతలు శపథం చేసి బయటకు వెళ్లిపోతుంటారు. అనంతరం అసెంబ్లీకి రాకుండా ప్రజల్లోనే తిరిగి సీఎంలుగా తిరిగి అసెంబ్లీలో అడుగుపెడుతుంటారు. అలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. ఆ చర్చకు కారణం… 2019 ఎన్నికల ఫలితాల అనంతరం కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు కూడా తన భార్యను అవమానించారని చెబుతూ బయటకు వచ్చేశారు.

అయితే ఆ శపథం చేసి బయటకు వచ్చేసిన చంద్రబాబు… మళ్లీ ముఖ్యమంత్రి హోదాలోనే సభలో అడుగుపెడతారా.. లేక, ఫలితాలు తేడా కొడితే.. సభకు నమస్కారం అంటారా అనేది ఆసక్తిగా మారింది. నాడు తమిళనాడులో తనను నిండు సభలో నాటి సీఎం కరుణానిధి అవమానించారు అని బాధపడిన జయలలిత ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. సీఎం గానే సభకు వస్తాను అని ఆమె భీషణ ప్రతిజ్ఞ చేశారు. చెప్పినట్లుగానే ఆమె గెలిచి వచ్చారు.

ఉమ్మడి ఏపీలో విపక్షంలో ఉన్న అన్న ఎన్టీఆర్ కూడా 1994 ఎన్నికలకు ముందు ఇటువంటి ప్రతిజ్ఞే చేశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తనను అవమానిస్తోందని ఆరోపణలు చేసి.. తాను సీఎంగానే అసెంబ్లీకి తిరిగి వస్తానని సంచలన ప్రకటన చేశారు. ఆ విధంగానే 1994 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి వచ్చారు ఎన్టీఆర్!

ఇక విభజిత ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే… 2014 లో విభజిత ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్నికయ్యారు. ఆ సమయంలో… తొలి ప్రతిపక్ష నేతగా జగన్ మొదట్లో అసెంబ్లీకి వెళ్లారు. కానీ ఆ తర్వాత సభలో తమను అవమానిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తూ.. తాను జనసభలోనే ఉంటానని, తిరిగి సీఎం గానే అసెంబ్లీకి వస్తాను అని చెప్పి బయటకు వెళ్లిపోయారు.

2019 ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో గెలిచి ముఖ్యమంత్రిగా హుందాగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ సమయంలో విపక్ష టీడీపీకి 23 సీట్లు మాత్రమే వచ్చాయి. దాంతో సభలో మాట్లాడేందుకు దక్కని అవకాశాలాతో చంద్రబాబు 2022లో బయటకు వెళ్లిపోయారు. మళ్లీ ఈ కౌరవ సభను అంతం చేసి ప్రజా మద్దతుతో గెలిచి అసెంబ్లీలో ముఖ్యమంత్రిగానే అడుగుపెడతాను అని బాబు శపధం చేశారు.

కట్ చేస్తే… ఆ సమయం ఆసన్నమైంది. 2024 ఎన్నికల పోలింగ్ ముగిసింది, జూన్ 4న ఫలితాలు రాబోతున్నాయి. దీంతో… తాను శపథం చేసినట్లుగా చంద్రబాబు నిజంగా గెలిచి అసెంబ్లీకి వస్తే అది ఒక సక్సెస్ ఫుల్ చరిత్రగా మిగిలిపోతుంది. కారణం… అసెంబ్లీలో చేసే ఆ శపథానికి చాలా గౌర్వం ఉంటుంది! అలా కాకుండా.. బాబు శపథాన్ని ప్రజలు పరిగణలోకి తీసుకోకుండా.. ఫలితం తేడా కొట్టి మరోసారి విపక్షానికే పరిమితం అవ్వాల్సి వస్తే పరిస్థితి ఏమిటి అనేది ఆసక్తిగా మారింది.

నిజంగా కూటమి అధికారంలోకి రాకపోతే చంద్రబాబు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో వస్తారా.. వస్తే అధికార వైసీపీ చేసే ర్యాగింగ్ ని తట్టుకుని నిలబడగలుగుతారా అన్నది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఒకవేళ ఆయన రెస్ట్ తీసుకుని చినబాబు గెలిస్తే.. ఆయనకు విపక్ష నేతగా అవకాశం ఇస్తే.. జగన్ & కో దాడిని తట్టుకోలగరా.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వీటిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.