చంద్రబాబు ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని చెబుతుంటారు ఆయన సన్నిహితులు! 2019 ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటికంటే… ఈ మధ్య ఆ ఫ్రస్ట్రేషన్ మరీ ఎక్కువైపోయిందని.. ఫలితంగా ఏమి మాట్లాడుతున్నామనే సోయ లేకుండా మాట్లాడుతున్నారని.. గతంలో చేసిన కొన్ని అజ్ఞాన పలుకుల ఫలితం చూసిన తర్వాత కూడా బాబు మస్థిష్కంలో మార్పు రాలేదని.. పైగా అది మార్పు వచ్చే వయసు కూడా కాదని ఆఫ్ ద రికార్డ్ వాపోతుంటారు! దీనికి సంబంధించిన తాజా ఉదాహరణ ఇప్పుడు చూద్దాం!
ప్రస్తుతం ఏపీ మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆశించిన స్థాయిలో జన సమీకరణ జరగడం లేదనో.. లేక, ప్రజలు స్వఛ్చందా రావడంలేదనో.. అదీగాక ఎండ తీవ్రత అధికంగా ఉండటంవల్లో తెలియదు కానీ… తీవ్రస్థాయిలో కేకలు వేస్తూ ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు చంద్రబాబు! అందులో భాగంగా తాజాగా అమరావతిలో ఒక సెంటు భూమి తీసుకుంటున్న పేదలపై తన అక్కసు వెళ్లగక్కారు!
ఏపీ శాసన రాజధాని అని చెబుతున్న అమరావతి ప్రాంతంలో అత్యంత విలువైన భూములను పేదలకు పంచాలని ఏపీ సర్కార్ నిర్ణయించిన సమయంలో… టీడీపీ నేతలు న్యాయస్థానాలను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే వారి ఆలోచనా విధానం తప్పని.. పేదలకు భూమిని ఇవ్వాలన్న ప్రభుత్వ ఆలోచన భేష్ అని తేల్చి చెప్పింది న్యాయస్థానం! దీంతో న్యాయస్థానలపై ఆగ్రహమో.. లేక, పేదప్రజలపై అక్కసో తెలియదు కానీ… సెంటు భూమిపై నోరు జారారు సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు!
పెందుర్తి ఎన్టీఆర్ జంక్షన్ లో జరిగిన సభలో మాట్లాడిన చంద్రబాబు… సెంటు భూమిలో ఇళ్లు కడతామని జగన్ చెబుతున్నారని, ఆ సెంటు భూమి బరియల్ గ్రౌండ్ కు మాత్రమే ఉపయోగపడుతుందని ఎద్దేవా చేశారు. ఎవరైనా చనిపోతే అందులో పూడ్చడానికి మాత్రమే దీన్ని ఉపయోగించవచ్చని అన్నారు. దీంతో అమరావతిలోని పేదలతో పాటు ఏపీలోని పేద మధ్యతరగతి వర్గాలు బాబు అహంకారపూరిత వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్నాయి.
“ఎవరైనా దళితులుగా పుట్టాలనుకుంటారా” అంటూ… భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేధ్కర్ ఫోటో పక్కన పెట్టుకుని కూడా గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో గత ఎన్నికల్లో ఏపీలోని 29 రిజర్వుడు స్థానాల్లో బాబును చితక్కొట్టేశారు ఎస్సీలు. వీరితోపాటు 7 ఎస్టీ స్థానాల్లో కూడా వాతపెట్టారు. ఇదే సమయంలో… తిరుపతిలో పనిచేస్తున్న బీసీలు తమ బాదలు చెబుదామని వస్తే… “పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా.. తోకలు కత్తిరిస్తాను” అంటూ తక్కువచేసి మాట్లాడారు. దీంతో… గడిచిన ఎన్నికల్లో చంద్రబాబును 23 స్థానాలకు పరిమితం చేస్తూ తోకలు కుతుకులోకి కత్తిరించేశారు బీసీ వర్గ ప్రజలు.
అయినా కూడా జ్ఞానం రాలేదో ఏమో కానీ… తాజాగా పేద ప్రజల బ్రతుకుపై వెటకారమాడారు చంద్రబాబు. అందరికీ రాజప్రసాదాలు, భారీ భారీ బంగ్లాలు, కరకట్టల్లో గెస్ట్ హౌస్ లు, పక్కరాష్ట్రాల్లో ఫాం హౌస్ లు కట్టుకునే స్థోమత ఉండదు కాబట్టి… రాజధాని ప్రాంతంలో కనీసం ఒక్క సెంటు స్థలమైనా ఉంటే ఇళ్లు కట్టుకోవచ్చని భావిస్తున్న పేదలు ఎందరో ఉన్నారు. వారికి జగన్ సర్కార్ భూమి ఇస్తుంటే… దాన్ని సమాధి దొడ్డుగా వ్యాఖ్యానిస్తున్నారు చంద్రబాబు. దీంతో ఈ వ్యాఖ్యల ఫలితం కూడా రాబోయే ఎన్నికల్లో బాబు కచ్చితంగా చూస్తారని హెచ్చరిస్తున్నారు “పేదలు”!