టిఆర్ ఎస్ కు మద్దతుగా తెలంగాణను ఏకం చేసిన బాబు

(శ్రవణ్ బాబు)

ఈ ఎన్నికల్లో విజయానికి కేసీఆర్ మొట్టమొదట కృతజ్ఞతలు చెప్పాల్సింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు. ఎందుకంటే, ఆఖరినిమిషంలో చంద్రబాబునాయుడు హైదరాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాలలో చేసిన ప్రచారం టీఆర్ఎస్ కు అనూహ్యరీతిలో కలిసొచ్చింది. చంద్ర బాబు పర్యటనల తర్వాత తెలంగాణలో మూడ్ ఒక్కసారిగా మారిపోయి టీఆర్ఎస్ కు అనుకూలంగా ఓట్ల పోలరైజేషన్ జరిగింది.

కొంగర కలాన్ సభనాటికి కేసీఆర్ తమ పార్టీ విజయంపై అంత ధీమాగా లేరన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ప్రభుత్వంపై యువత, నిరుద్యోగులు, ప్రభుత్వోద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులువంటి కొన్ని వర్గాలైతే తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి రాష్ట్ర ప్రజలందరితోబాటు కేసీఆర్ కు కూడా తెలుసు. అందుకే ఆయన తెలంగాణ ఉద్యమం విజయవంతమవటానికి కారణమైన సెంటిమెంట్ అనే ఆయుధాన్నే మళ్ళీ ఈ ఎన్నికల్లో వాడాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు నాయుడు తెలంగాణలో మళ్ళీ రాజ్యమేలటానికి వస్తున్నారని, ఆంధ్రోళ్ళ పాలన మళ్ళీ వస్తుందని చెప్పుకొచ్చారు. అయితే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేనాటికి ఆ సెంటిమెంట్ మాటలను ప్రజలు పెద్దగా పట్టించుకోకపోయినా, అనూహ్యరీతిలో అదే విషయం చివరిదశలో కేసీఆర్ కు కలిసిరావటం ఒక విచిత్ర పరిణామం.

కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం, తెలంగాణ జనసమితి, సీపీఐలతో కలిసి ప్రజా ఫ్రంట్ ను ఏర్పాటు చేసే సమయానికి తెలంగాణలోని కేసీఆర్ వ్యతిరేక వర్గాల ఆగ్రహం అలాగే ఉంది. కానీ, చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తూ చేసిన పిచ్చి పిచ్చి ప్రేలాపనలు ఓట్ల పోలరైజేషన్ కు కారణమయ్యాయి. ఆధునిక తెలంగాణ సృష్టికర్తను తానేనని, హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తానేనని ఆయన పదే పదే చెప్పటం కేసీఆర్ వ్యతిరేక వర్గాలను పునరాలోచనలో పడేసింది. దానికితోడు టీఆర్ఎస్ అనుకూల వర్గాలు సోషల్ మీడియాలో చంద్రబాబు ప్రసంగాల వీడియోలను సర్క్యులేట్ చేస్తూ రెచ్చగొట్టారు. దీనితో ఆఖరి నిమిషంలో మూడ్ మొత్తం మారిపోయింది. సెంటిమెంట్ చాపకింద నీరులా పనిచేసింది. ఓటర్లు టర్న్ ఎరౌండ్ అయ్యారు.

చంద్రబాబు విషయాన్ని పక్కన పెడితే, టీఆర్ఎస్ కు అనుకూలించిన మిగిలిన విషయాలను చూస్తే… ఆ పార్టీ అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల వలన లబ్దిదార్లు, ముఖ్యంగా మహిళా ఓటర్లు అత్యధికచోట్ల గంపగుత్తగా టీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచారు. మరోవైపు బీజేపీ, బీఎల్ఎఫ్ వంటి పార్టీలు అనేకచోట్ల బలమైన అభ్యర్థులను నిలపటంవలన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయింది.

ఈ కారణాలన్నింటివల్లా టీఆర్ఎస్ విజయం సాధ్యమయింది. ఏదిఏమైనా చంద్రబాబు నాయుడును రంగంలోకి దించి కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వినాశనాన్ని తామే తెచ్చుకున్నారు.

కొసమెరుపు: చంద్రబాబు నాయుడు ఓ పక్కన తెలంగాణలోని కేసీఆర్ వ్యతిరేక వర్గాలనుకూడా టర్న్ ఎరౌండ్ చేస్తే, ఆయన బావమరిది బాలయ్య కూకట్ పల్లి నియోజకవర్గంలో తన వంతు పాత్ర పోషించారు. ఆయన టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేసి అక్కడున్న తెలంగాణ ఓటర్లను మరింత రెచ్చగొట్టారు. చిత్ర విచిత్రమైన సంభాషణలతో, ప్రసంగాలతో ప్రచారంలో కమెడియన్లు లేని లోటు తీర్చి, చివరికి తన అన్నకూతురి ఓటమికి కారణమయ్యారు.

(శ్రవణ్ బాబు, సీనియర్ జర్నలిస్టు, హైదరాబాాద్)