చంద్రబాబు అడిగింది లాజిక్కే..జగన్ చేయబోయే పనికి మోదీకి మండిపోదా మరి ?

Chandrababu brings new logic in Polavaram issue 
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు కొన్ని లాజిక్స్ మాట్లాడుతుంటారు. వాటిలో కొన్ని నిజాలు కూడ ఉంటాయి.  ప్రధానంగా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడానికి, జగన్ తీసుకునే నిర్ణయాలు తప్పని చూపడానికి బాబుగారు కారణాలు చెబుతుంటారు.  తాజాగా జగన్ తీసుకున్న ఒక నిర్ణయాన్ని తప్పని నిరూపించే పనిలో పడ్డారు చంద్రబాబు.  రాష్ట్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ విషయంలో పాలక పక్షం, ప్రతిపక్షం మధ్యన ఎన్నో వాదోపవాదనలు నడుస్తున్న సంగతి తెలిసందే.  చంద్రబబు హయాంలో పోలవరాన్ని ఏటీఎం మాదిరి వాడేశారని, ఎన్ని అవినీతి, అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది.  ఇక ప్రతిపక్షం అయితే పాలక వర్గం చెప్పే మాటలన్నీ ఒట్టి అబద్దాలని అవినీతి జరిగి ఉంటే నిరూపించమని సవాల్ విసురుతోంది.
 
Chandrababu brings new logic in Polavaram issue 
Chandrababu brings new logic in Polavaram issue
ఈ నేపథ్యంలోనే కేంద్రం అంచనా వ్యయంలో కొర్రీలు పెట్టడం స్టార్ట్ చేసింది.  55 వేల కోట్ల అంచనా వ్యయాన్ని 23 వేల కోట్లకు కుదించే ప్రయత్నం చేస్తోంది.  కేంద్రంతో పోరాడైనా ప్రాజెక్ట్ పూర్తిచేయాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని చేయలేరని ధీమాగా ఉంది.  కేసులకు భయపడి జగన్ పోలవరం ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారని ఆరోపిస్తుంటే ఇంకో ఏడాదిలో ప్రాజెక్ట్ కట్టి తీరుతామని వైసీపీ సర్కార్ బల్లగుద్ది చెబుతోంది.  అంతేకాదు ప్రాజెక్ట్ ముందు భాగాన 150 అడుగుల ఎత్తున వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని పెడతామని చెప్పారు.  ఇదే చంద్రబాబుకు గుబులు పుట్టిస్తోంది.  జగన్ అన్నట్టే వైఎస్ఆర్ విగ్రహం పెడితే మాత్రం పూర్తి క్రెడిట్ ఆయన ఖాతాలోకే వెళ్లి  చంద్రబాబుకు ఏమీ మిగలదు.  అందుకే విగ్రహం నిర్ణయం తప్పని ప్రూవ్ చేసే పనిలో ఉన్నారాయన. 
 
పోలవరం అనేది జాతీయ ప్రాజెక్ట్.  అలాంటప్పుడు అక్కడ వైఎస్ఆర్ విగ్రహం పెట్టడం ఎలా సాధ్యం, పెడితే కేంద్ర ప్రభుత్వం ఊరుకుంటుందా అంటూ కొత్త పాయింట్ లేవనెత్తారు.  నిశితంగా పరిశీలిస్తే బాబుగారి మాటల్లో వాస్తవం లేకపోలేదనే అనిపిస్తోంది.  పోలవరం పూర్తికావడం రాష్ట్రానికి అవసరమయితే పూర్తిచేయడం కేంద్రం బాధ్యత.  ఇలాంటి జాతీయ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం కొత్తేమీ కాదు.  ఇప్పటికే 15 జాతీయ ప్రాజెక్టులు నిర్మాణానికి నోచుకోలేదు.  కాస్తో కూస్తో ముందుకు సాగుతున్నది పోలవరమే.  ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే కేంద్రం మీద నయానో భయానో ఇంకా చాలా ఒత్తిడి తేవాల్సి ఉంటుంది.  ప్రాజెక్ట్ కోసం విడుదలచేసే ప్రతి రూపాయికి ప్రతిఫలం ఆశిస్తుంది కేంద్రం.  ఇప్పటికే ఈ ప్రాజెక్టును ఉపయోగించుకుని వచ్చే ఎన్నికల్లో  రాష్ట్రంలో పాతుకుపోవాలని చూస్తోంది.  
 
అంటే.. ప్రాజెక్ట్ ఘనతను మొత్తంగా తీసేసుకోవాలని బీజేపీ చూస్తోంది.  అలాంటప్పుడు జగన్ ప్రాజెక్ట్ ముందు వైఎస్ఆర్ విగ్రహం పెడతామంటే మోదీ సరే ప్రారంభోత్సవానికి పిలవండని ఊరుకోరు కదా.  కేంద్రం నిధులతో కట్టే ప్రాజెక్ట్ ముందు వైఎస్ఆర్ విగ్రహం పెట్టడం ఏమిటని తప్పుకుండా ఆక్షేపిస్తారు.  కాదు కూడదు పెట్టి తీరాల్సిందే అంటే నిధులు విడుదలలో జాప్యం చేసినా చేయవచ్చు.  చంద్రబాబు ఇప్పుడు ఇదే కారణాన్నిచూపిస్తున్నారు. జగన్ తన నిర్ణయంతో ప్రాజెక్ట్ పూర్తికాకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.  కేంద్రాన్ని  బుజ్జగించి నిధులు తెచ్చుకోవాలని కానీ ఇలా సొంత అవసరాల కోసం అడ్డం  తిరిగితే పనులు జరగవని చెబుతున్నారు.  మరి బాబుగారు తవ్వి తీసిన ఈ లాజిక్ కు వైసీపీ నుండి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.