టీడీపీ అధ్యక్షుడు, విపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఇన్నాళ్లు హైదరాబాద్ నుండే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారు. కరోనా కారణంగా ఇన్నాళ్లు ఆయన సరిగా ఏపీలో ఉండలేకపోయారు. దీంతో పార్టీ కార్యకలాపాల్లో ఆయన సరిగా పాల్గొనలేకపోయారు. అధినేతే అందుబాటులో లేకపోవడంతో పార్టీ శ్రేణులు నిస్తేజంగా ఉండిపోయాయి.
అసలు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు మీద చాలా భారం పడింది. దారుణమైన ఓటమికి గల కారణాలు ఏమిటి, ఎక్కడ తప్పు జరిగింది, వాటిని ఎలా సరిచేసుకోవాలి, సంక్షోభంలో కూరుకున్న పార్టీని తిరిగి నిలబెట్టడం ఇలా బాబుగారు చేయాల్సిన పనులు చాలానే ఉండిపోయాయి. పైగా జగన్ మూడు రాజధానులు అనడంతో అమరావతిని కాపాడుకునే అదనపు బాధ్యత కూడ చేరింది.
చంద్రబాబు సైతం ఈ లోటు పాట్లు, బాధ్యతలు చూసుకోవడం కోవడానికి సన్నద్దమవుతుండగా కరోనా మహమ్మారి విజృంభించడంతో వయసు రీత్యా ఆయన హైదరాబాద్లోని నివాసానికి పరిమితమయ్యారు. ఈ గ్యాప్ అధికార వర్గానికి బాగా కలిసొచ్చింది. అసెంబ్లీ సమావేశాలు లేకపోవడం, బయటికొచ్చి కనీసం సభ లేదా సమావేశం పెట్టుకునే వీలు లేకపోవడంతో పార్టీకి ఆయనకు, పార్టీకి, జనానికి దూరం పెరిగింది. పాలక వర్గం మీద పోరాడే ఛాన్స్ లేకుండా పోయింది. కనీసం పార్టీ వర్గాలతో మమేకమయ్యే అవకాశం లేదు. ఇక అప్పుడే మొదలైన అమరావతి రైతుల ఉద్యమాన్ని ఉధృతం చేయాలనుకున్న బాబుగారి లక్ష్యం అటకెక్కింది. చివరికి టీడీపీకి ఎంతో ముఖ్యమైన మహానాడు కార్యక్రమాన్ని సైతం జూమ్ యాప్ ద్వారా జరుపుకోవాల్సి వచ్చింది. మరోవైపు పార్టీ లీడర్ల ఆరెస్టులు పెద్ద తలనొప్పిగా మారాయి.
గత నాలుగు నెలలుగా అయన కేవలం వర్చ్యువల్ సమావేశాల ద్వారా మాత్రమే నేతలతో టచ్లో ఉంటూ వచ్చారు. ఫలితంగా కార్యకర్తలు నిస్తేజం అయిపోయారు. యువనాయకత్వం దిశా నిర్దేశం లేక చప్పబడిపోయింది. పాలక వర్గం అయితే చంద్రబాబును జూమ్ నాయుడు అంటూ ఎద్దేవా చేసేవి, భయపడి హైదరాబాద్లో దాంకున్న బాబుకు ఏపీ రాజకీయాల గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. మొత్తం మీద లాక్ డౌన్ ఎఫెక్ట్ రాజకీయంగా టీడీపీని, చంద్రబాబును వెనక్కి నెట్టింది. అందుకే ఇంకా ఆలస్యం చేస్తే కుదరదని భావించిన బాబు రేపు బుధవారం విజయవాడకు బయలుదేరుతున్నారు. ఇకపై అంతా ఫేస్ టూ ఫేస్ అనేలా ఉంటుందట కార్యాచరణ. అన్ని పార్టీ పనుల్లోనూ భౌతికంగా పాల్గొంటారట. ఈ వార్తతో తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహం నిండింది. మరి ఈ పరిణామం టీడీపీలో జవసత్వాలు తెస్తుందేమో చూడాలి.