వెయిటింగ్… చంద్రబాబు ఆ ఒక్కమాటా ఎప్పుడు చెబుతారో…?

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఈ సమయంలో రాజకీయ పార్టీల బహిరంగ సభలు హోరెత్తిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే “సిద్ధం” అంటూ జగన్ సభలు నిర్వహిస్తుంటే… తాజాగా “జెండా” అంటూ టీడీపీ – జనసేనలు ఉమ్మడి సభను నిర్వహించాయి. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన ప్రసంగంలో అతిముఖ్యమైన అంశం మిస్సయ్యిందని జనసైనికులు ఫీలవుతుంటే… మంత్రి అంబటి అదే విషయాన్ని గుచ్చి గుచ్చి అడుగుతున్నారు!

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ – జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల అభ్యర్థుల ఉమ్మడి జాబితాను ప్రకటించారు. పొత్తులో భాగంగా జనసేనకు 24 స్థానాలు కేటాయించారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తల్లోనూ, శ్రేయోభిలాషుల్లోనూ, నేతల్లోనూ తీవ్ర అసంతృప్తి పెళ్లుబికింది. దీంతో… పలు చోట్ల టీడీపీ నేతలను ఓడిస్తామంటూ జనసేన నేతలు, జనసైనికులు శపథాలు చేస్తున్నారు.

ఆ సంగతి అలా ఉంటే… తనను ప్రశ్నించేవారు తన వారు కాదు, తాను నిర్ణయం తీసుకుంటే దానికి అంగీకరించాలి, తాను మోయమన్న జెండా మోయాలి, వ్యూహాలు తనకు వదిలేయాలి అంటూ పవన్ కల్యాణ్.. టీడీపీతో కలిసి తాజాగా “జెండా” అనే సభలో పాల్గొని, ఆవేశంగా మాట్లాడారు. అనంతరం మైకందుకున్న చంద్రబాబు… తనదైన రొటీన్ ప్రసంగం చేశారు. అసలు విషయం తప్పా అన్నీ చెప్పినట్లుగా ప్రసంగించారు.

తాడేపల్లిగూడెంలో జరిగిన ఉమ్మడి ఎన్నికల సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ.. ఎప్పటిలాగే రొటీన్ డైలాగులు పేల్చారు. ఇందులో భాగంగా వైసీపీ పాలనలో అమరావతికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో రాయలసీమ అభివృద్ధి గురించి పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. జగన్ ని సైకో అంటూ దుయ్యబట్టారు. అయితే… అధికారంలో జనసేనకు వాటా ఉంటుందని మాత్రం చెప్పలేకపోయారు.

దీంతో… జనసైనికులు, పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన శ్రేయోభిలాషులతో పాటు కాపు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మంత్రి అంబటి రాంబాబు లైన్లోకి వచ్చారు. ఇదే విషయంపై స్పందించారు. ఇందులో భాగంగా… “పవర్ స్టార్, పవర్ స్టార్ అని పొగడమే కానీ… పవర్ షేర్ గురించి మాత్రం మాట్లాడరు. మోసపోకండి జనసైనికులారా!” అంటూ మంత్రి అంబటి ట్వీట్ చేశారు. దీంతో ఈ విషయం మరింత చర్చనీయాంశం అవుతుంది.