మోడీకి బహిరంగ ప్రేమలేఖ రాసిన బాబు… రియాక్షన్ ప్లీజ్!

ఎప్పటినుంచో ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్న మాట… బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు అవిశ్రాంతంగా ప్రాకులాడుతున్నారని! 2014 ఎన్నికల్లో కలిసినట్లుగానే… టీడీపీ – బీజేపీ – జనసేన కలిసి పోటీచేస్తే, వైఎస్సార్ సీపీని ధైర్యంగా ఎదుర్కొచ్చనేది ఆయన ఆలోచన! అయితే… ఎప్పుడు పిలిస్తే అప్పుడొచ్చి సైకిల్ ఎక్కడానికి జనసేన అధినేత పవన్ సిద్ధంగానే ఉన్నా… అసలు సమస్యంతా బీజేపీతోనే ఉంది! అయితే… ఈ విషయంలో ఇక ఆలస్యం చేస్తే మంచిది కాదని గ్రహించిన చంద్రబాబు… మోడీకి బహిరంగంగానే ప్రపోజ్ చేసేశారు!

అవును… తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన బాబు… ప్రధాని ఆలోచనలకు అనుగుణంగా కలిసి పనిచేయడానికి సిద్ధమని ప్రకటించారు. “ఎన్డీఏకు సపోర్ట్ చేసే అవకాశం ఉందా”? అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన బాబు… దేశాభివృద్ధి కోసం ప్రధాని చేసే పనులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని.. అభివృద్ధి విషయంలో ప్రధాని ఏ ఆలోచనతో ఉన్నారో.. తానూ అదే ఆలోచనతో ఉన్నానని.. దాదాపు ఇద్దరమూ ఒకేలా ఆలోచిస్తామన్నట్లుగా చంద్రబాబు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

బాబు బీజేపీతో మైత్రి కోసం ఎంతవరకైనా దిగిపోతారనడానికి సరిపోయే తాజా ఉదాహరణ ఒకటి బాబు ఇచ్చారు. అదేమిటంటే… ప్రధాని విజన్‌తో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని.. గతంలో కూడా తాను మోదీ పాలసీలను వ్యతిరేకించలేదని.. ప్రత్యేక హోదా సెంటిమెంటుగా మారిన దానిమీద మాత్రమే తాను అప్పట్లో పోరాడానని చంద్రబాబు వ్యాఖ్యానించారు! అంటే… ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం మోడీనే అని.. తాను ప్రత్యేక హోదా ప్యాకేజీ తీసుకోవడంలో తన నేరం లేదని బాబు పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశారు!

అక్కడితో ఆగని చంద్రబాబు… బీజేపీ హయాంలో కేంద్రమంత్రి పదవులను సైతం వద్దనుకున్నామని తెలిపారు. అవును… వాజ్ పేయి హయాంలో టీడీపీకి ఆరేడు కేంద్ర మంత్రిత్వ శాఖలు కేటాయిస్తామన్నా కూడా తాము అంగీకరించలేదని బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే.. కేంద్రమంత్రి పదవులు సైతం బాబు బీజేపీకి ఎందుకు త్యాగం చేశారన్నది తెలియాల్సి ఉంది!

అయితే… చంద్రబాబు ఇంత ఓపెన్ గా మోడీకి ప్రేమలేఖ రాయడంపై ఏపీ బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారు..? పైగా… “ఎన్డీఏలో భాగస్వామి కావడమనేది మేటరాఫ్ టైమే”నని బాబు వ్యాఖ్యనించడంపై ఢిల్లీలోని బీజేపీ పెద్దలు ఎలా రియక్ట్ అవుతారు..? అనేది వేచి చూడాలి!