కడప వెర్సెస్ బషీర్ బాగ్: ఇంకా జ్ఞానోదయం కాకపోతే ఎలా..?

ఏమాటకామాట చెప్పుకోవాలంటే ఇప్పటి ఓటర్లు చాలా తెలివైన వారు. కుటుంబంలో ఒక్కరికైనా నేటి సమకాలీన రాజకీయాలపైనా, రాజకీయనాయకులు చేసుకునే విమర్శలూ ప్రతివిమర్శలపైన ఒక అవగాహన ఉంటుంది. ఎవరు చెబుతున్నది నిజం.. మరెవరు చెబుతున్నది అబద్దం అన్న విషయాలపట్ల స్పష్టమైన అవగాహన ఉంది! అది ఇప్పటికే 2019 ఎన్నికల ఫలితాల్లో నిరూపణ అయ్యింది! అయినా కూడా బాబులో మార్పు రావడం లేదు!

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో “అసుర” టాపిక్ కీలకంగా మారింది. వైఎస్ వివేకానంద రెడ్డి మరణం విషయంపై ప్రస్తుతం సీబీఐ ఎంక్వైరీ నడుస్తుంది. అంశం కోర్టు పరిధిలో ఉంది! ఆ మాత్రం కూడా ఆలోచించకుండా… “జగనాసుర” పుస్తకం ప్రచురించేసింది టీడీపీ! నేరం జగన్ చేసినట్లు నిరూపణ అయితే.. పుస్తకం కాదు ఏకంగా గ్రంథాలే ప్రచురించుకోవచ్చు. కానీ… తమ్ముళ్లు తొందరపడ్డారు! ఫలితం గతంలో లక్షకోట్ల అవినీతి అంటూ చేసిన ప్రచారం వల్ల టీడీపీకి ఎంత ఒరిగిందో తెలిసిందే కదా అనేటాపిక్ మళ్లీ వెలుగులోకి వచ్చింది!

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ ప్రధాన అస్త్రాల్లో జగన్ లక్షకోట్ల అవినీతి అనే ప్రచారాన్ని నమ్ముకుంది. కాని జనం నమ్మలేదు.. ఫలితం 151 – 23.! ఇప్పుడు కూడా సేం సీన్ ని రిపీట్ చేసే పనికి పూనుకుంది టీడీపీ. ఈ అత్యుత్సాహం వల్ల… ఇది “జగనాసుర” కాదు… ఎన్టీఆర్ విషయంలోనూ పుష్కరాల్లోనూ, రోడ్లపైన మీటింగుల్లోనూ, గతంలో బషీర్ బాగ్ లో నూ బాబు గారు చేసింది అసలు సిసలు “అసుర” కార్యక్రమం అని గతాన్ని తవ్వే పనిలో పడ్డారు వైకాపా నేతలు!

దీంతో సుమారు 22 సంవత్సరాల క్రితం జరిగిన బషీర్ బాగ్ సంఘటన నుంచి బాబుగారి అసుర రాజకీయం ఎలా ఉంటుందో చూడండి అంటూ వైకాపా నేతలు “నారాసుర” పుస్తకం ప్రచురించే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది! పైగా వివేకానందరెడ్డి మరణం విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు కానీ… బషీర్ బాగ్ లో బాబు రాజకీయం, పుష్కరాల్లో పబ్లిసిటీ వ్యవహారం, ఇరుకు సందుల్లోని సభల సందడి అన్నవి ప్రజల్లో ఒక క్లారిటీలో ఉన్న అంశాలే! దీంతో “జగనాసుర” కంటే “నారాసుర” మరింత రంజుగా ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు విశ్లేషకులు!

ఏది ఏమైనా… జగన్ పాలనలో జనాలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకుంటూ.. “జగన్ పాలన”పై పుస్తకం ప్రచురించకుండా.. ప్రజలకు పూర్తిగా అవసరం లేని, ప్రజల్లో స్పష్టత లేని అంశాలపై విమర్శలు చేస్తూ, రుద్దే ప్రయత్నం చేయడం వల్ల జరిగిన డ్యామేజ్ ని బాబు మరోసారి మొదలుపెట్టారని అంటున్నారు తమ్ముళ్లు! మరి ఈ “అసుర” పుస్తకాల వ్యవహారం ఎక్కడి వరకూ వెళ్తుంది.. దాని ఫలితం ఎలా ఉండబోతుంది అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి!