ఆంధ్ర ప్రదేశ్: గత రెండేళ్ల నుండి ఎప్పుడెప్పుడా అనుకుంటున్న పంచాయతీ ఎన్నికలలో భాగంగా మొదటి షెడ్యూల్ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. అయితే… ఆది నుంచి అనేక ఆశలు పెట్టుకున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం ఎక్కడా ఆశించిన విధంగా ఫలితాలు కనబరచలేక పోయింది. వాస్తవానికి పంచాయతీ ఎన్నికలను చంద్రబాబు, ఆయన పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలోనే నిత్యం మీడియాలోను, జూమ్ యాప్‌లోను తమ్ముళ్లకు .. దిశానిర్దేశం చేశారు. అంతేకాదు.. 24/7 అందుబాటులో ఉండే కాల్ లైన్‌ను కూడా ప్రవేశ పెట్టారు.
ఎన్నికల సంఘం దన్నుగా ఉందనే వ్యాఖ్యలు కూడా టీడీపీ విషయంలో ఉన్నాయి. ఇదిలావుంటే… సామాజిక వర్గాలను ఏకం చేసేందుకు, టీడీపీ వైపు తిప్పుకొనేందుకు కూడా చంద్రబాబు ప్రయత్నించారు. ఎక్కడికక్కడ పోటీలో దింపేందుకు యువతను కూడా సమీకరించారు. అదే సమయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో ఎవరూ సుఖంగా లేరనే టాక్ తీసుకువచ్చారు. దీనికితోడు ప్రభుత్వ వైఫల్యాలంటూ.. నిత్యం మీడియాలో సమావేశాలు నిర్వహించారు.
ఇన్ని చేసినా.. తాజాగా ఫలితాల్లో టీడీపీ ఎక్కడా పుంజుకున్న పాపాన పోలేదని సొంత పార్టీ నేతలే విమర్శించే పరిస్థితి వచ్చింది.నిజానికి పంచాయతీ ఎన్నికల్లో ఇంత భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనడం ఇదే తొలిసారి. ఇక, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా.. పోలీసులు కూడా భద్రత కల్పించారు. వాస్తవానికి గత 2013 ఎన్నికల్లో పంచాయతీల్లో తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయితే.. ఈ దఫా అలాంటి పరిస్థితి కనిపించలేదు.
చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనూ వైసీపీ అత్యధిక స్థానాలను ఎగరేసుకుపోయింది. మొత్తంగా చూస్తే.. ఒక్క కృష్ణా జిల్లాలో మాత్రం ఒకే ఒక్కచోట టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. పంచాయితీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాష్ట్రంలో ఆ సమయానికి అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగానే ప్రజలు తీర్పు ఇస్తారని చరిత్ర చెప్తుంది. కానీ ప్రతిపక్ష పార్టీకి ఈ స్థాయిలో వ్యతిరేకత మాత్రం ఉండదు. అంటే… దీంతో రాష్ట్రంలో టీడీపీ ఇక చరిత్రలో మిగిలిపోయే పార్టీగా అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.