Chandra Babu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లపై దృష్టి సారించారు. గత ఐదు సంవత్సరాల కాలంలో వైకాపా ప్రభుత్వం కొత్త రోడ్లను నిర్మించకపోవటమే కాకుండా, రోడ్లపై పడిన గుంతలను కూడా పూడ్చలేక పోయింది అంటూ ఈయన విమర్శలు చేశారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లపై పడిన గుంతలను పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రోడ్ల నిర్వహణపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రతిపాదన చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా రోడ్లను పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టడానికి ఒక సరికొత్త ఆలోచన చేశామని ఈయన వెల్లడించారు.ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి రహదారుల నిర్వహణ అప్పగిస్తే ఎలా ఉంటుందని యోచిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఈ విషయంపై ఎమ్మెల్యేలు కూడా వారి అభిప్రాయాలను వివరణను తెలియజేయాలని చంద్రబాబు కోరారు. గ్రామం నుంచి మండల కేంద్రానికి వెళ్లే వాహనదారులు ఎటువంటి టోల్ ఫీజ్ చెల్లించాల్సిన అవసరం లేదని తెలియజేశారు. మిగిలిన చోట్ల టోల్ చెల్లించాల్సి ఉంటుందని అది కూడా లారీలు బస్సులు, కార్లకు మాత్రమే చార్జీలు వసూలు చేస్తారని తెలిపారు.
ఈ విషయంపై ప్రజలందరినీ ఒప్పించగలిగితే తొందరలోనే పనులు కూడా ప్రారంభమవుతాయని 2025 సంక్రాంతి పండుగకు ఊరికి వచ్చే వారందరూ కూడా రోడ్డుపై ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడకుండా ప్రశాంతమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగించడం కోసం చర్యలు చేపడతామని చంద్రబాబు నాయుడు తెలిపారు..
మనవద్ద ఎన్నో సరికొత్త ఆలోచనలు ఉన్నాయి.. డబ్బులు మాత్రమే లేవని చంద్రబాబు తెలిపారు. ఇక డబ్బులు లేవు అన్ని మీరే చూసుకోవాలి అని చెబితే నా దగ్గర మంత్రదండం లేదని కేవలం ఆలోచనలు మాత్రమే ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. డబ్బులు లేకపోయినా కేవలం ఒక్క ఆలోచన దేశాన్ని మార్చేస్తుందని చంద్రబాబు తెలిపారు. ఐదేళ్లలో రాష్ట్రంలోని పలు రహదారులపై లక్షలాది గుంతలు ఏర్పడ్డాయని, వాటి మరమ్మతులకు 850 కోట్ల రూపాయలను అల్రెడీ కేటాయించామని చెప్పారు. ఆ పనులు ఓ పక్కన జరుగుతూనే ఉన్నాయని అన్నారు.