పదిమందికి చెప్పాల్సిన చంద్రబాబు… ఇంకా చెప్పించుకునే స్టేజ్ లోనే ఉన్నారా? ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా మారకున్నారా? ఎవరు ఎన్ననుకున్నా తన పంథా ఇదేనని చెప్పాలనుకుంటున్నారా? అంటే… అవుననే అంటున్నారు టీడీపీ నేతలు. బాబు ఈసారి కూడా ఇలానే ప్రవర్తిస్తే… ఇక పార్టీ చాప చుట్టేయడమే మిగిలుతుందని ఫీలవుతున్నారు.
వివరాళ్లోకి వస్తే… తాజాగా బాబు చేపట్టిన గుడివాడ టూర్ తో తమ అంతర్గత సమస్యలకు, కేడర్ లో నెలకొన్న కన్ ఫ్యూజన్ కు పరిష్కారం లభిస్తుందని టీడీపీ నేతలు భావించారు. తాను మారానని చెప్పుకుంటున్న బాబు.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ సమస్యలు పరిష్కరిస్తారని నమ్మారు. కానీ.. అలాంటిదేమీ జరగకపోగా.. మరింత కన్ఫ్యూజన్ కు గురయ్యేలా బాబు వ్యవహారశైలి ఉందని చెబుతున్నారు టీడీపీ నేతలు! మీ చావు మీరు చావండి అన్నట్లుగా వదిలేసి వెళ్లిపోయారని చెబుతున్నారు.
అవును… గుడివాడ – నూజివీడు – పెనమలూరు – పామర్రు నియోజకవర్గాల్లో టీడీపీలో నేతల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. ఒక్కో సీటు కోసం ఇప్పటికే ఇద్దరిద్దరు ఆశావహులు రెడీగా ఉన్నారు. పైగా వారి మధ్య నెలకొన్న అంతర్గత పోరుతో… కేడర్ లో కూడా చీలికలొచ్చేశాయి. ఇందులో భాగంగా… ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గం కొత్తగా వచ్చిన వెనిగళ్ల రాముకు టికెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లే.. తాజాగా నిర్వహించిన సభను సక్సెస్ చేయటంలో అంచనాలకు మించే చేశారన్న పేరును తెచ్చుకున్నారు రాము.
దీంతో… ఈ వేదిక మీద నుంచి రాము పేరును చంద్రబాబు ప్రకటిస్తారని ఆయనతో పాటు, ఆయన అనుచరులు, టీడీపీ కేడరు ఆశించారు. కానీ… ఇంతా చేసి అంత భారీ సభ ఏర్పాటు చేసుకున్నా… అందుకు భిన్నంగా చంద్రబాబు కనీసం ఆయన పేరు కూడా ప్రస్తావించలేదు. దీంతో రాము ఆవేదన చెందుతుంటే… అనుచరులు – కేడర్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట.
ఇదే క్రమంలో… పెనమలూరులో కూడా బోడే ప్రసాద్ కు వ్యతిరేకంగా రెండు వర్గాలు పని చేస్తున్నాయి. గత ఎన్నికల్లో బోడే పరాజయానికి కూడా ఈ వర్గవిభేదాలే కారణమని చెబుతారు. అయితే ఈసారి బాబు వస్తున్నారు కాబట్టి… ఆ వర్గాలను కూర్చోబెట్టి బాబు మాట్లాడతారని.. సమస్యను పరిష్కరించి, బోడెకు కాస్త మనశ్శాంతి అనుగ్రహించి వెళ్తారని భావించారు. కానీ… బాబు ఆ విషయమేమీ పట్టించుకోలేదు.
ఇదే క్రమంలో… పామర్రులో కూడా టికెట్ పోరు తారాస్థాయికి చేరుకుంటుంది. ఇక్కడ కూడా సీనియర్ నేతలు టిక్కెట్ ఆశిస్తుండటంతో… ఇక్కడ కూడా వర్గాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా టీడీపీలో బలమైన దళిత నేతగా, పార్టీకి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పేరున్న వర్ల రామయ్య.. తన కొడుకు కుమార్ రాజాకు టిక్కెట్ కన్ ఫాం అని నమ్ముతున్నారు. కేడర్ కు అదే చెబుతున్నారు. అయితే… వర్లకు పోటీగా… మాజీ ఎమ్మెల్సీ ఉప్పులేటి కల్పన కూడా ఇక్కడనుంచి రేసులో ఉన్నారు. దీంతో పార్టీలో టికెట్ కోసం అధిపత్య పోరు నడుస్తోంది. ఈ సమస్యను కూడా బాబు పరిష్కరించలేదు.
దీంతో… ఈ పర్యటనలో పంచాయతీలన్నీ సెట్ చేసి వెళ్తారని.. ఎవరికి సీటు, ఎవరికి వేటు అనే విషయాలపై క్లారిటీ ఇస్తారని అంతా భావించారు. నియోజకవర్గాల్లో పార్టీ అంతర్గత కుమ్ములాటలను పరీష్కరించి వెళ్లాలని కోరుకున్నారు. కానీ… బాబు అలాంటి పనేమీ చేయలేదు. వచ్చారు, జగన్ ని తిట్టారు, తనని పొగుడుకున్నారు.. వెళ్లారు!! దీంతో… “బాబు ఇంక మారరు… ఇది ఫిక్స్” అని ఫీలవుతున్నారు తమ్ముళ్లు!