తెలంగాణలో ఓటుకు నోటు కేసు, తదనంతర పరిణామాల అనంతరం చంద్రబాబు హైదరాబాద్ ని వదిలి ఏపీరాజకీయాలకు మాత్రమే పరిమితమైపోతే… రేవంత్ రెడ్డి ఏకంగా టీడీపీని వదిలి కాంగ్రెస్ లో చేరిపోయారు! ఇంకా గట్టిగా మాట్లాడితే… ఏపీలో బాబు కంటే.. తెలంగాణలో రేవంత్ దూకుడు ప్రదర్శిస్తున్నారు! ఈ దూకుడులో భాగమో ఏమో కానీ.. తాజాగా ఒక ప్రతిపాదన తెరపైకి తెచ్చారు రేవంత్!
ఆవేశంలో అన్నారో, అనాలోచితంగా అన్నారో లేక అంతర్లీనంగా మరేదైనా ఉద్దేశ్యం ఉండి అన్నారో తెలియదు కానీ… తెలంగాణలో ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధిదారులు అందరూ, బీఆరెస్స్ పార్టీకి ఓట్లు వేయండి.. ప్రభుత్వ పథకాలు పొందకుండా ఉండిపోయిన వారు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే చాలు” అని చెబుతున్నారు రేవంత్ రెడ్డి. అవును.. తెలంగాణలో హత్ సే హాత్ జోడో పేరున పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు!
తెలంగాణలో ప్రభుత్వ పథకాలు పొందని లబ్ధిదారులు అధికసంఖ్యలో ఉన్నారనే సమాచారం ఉండబట్టి అలా అన్నారని కాసేపు సరిపెట్టుకున్నా… ఇదే సూత్రం రేవంత్ గురువు చంద్రబాబు కూడా ఏపీలో ఫాలో అయితే ఏమిటి పరిస్థితి అన్నది ఇప్పుడు ఉత్పన్నమవుతున్న ప్రశ్న!
అవును… ఏపీలో జగన్ కూడా దాదాపు ఇలాంటి స్టేట్ మెంటే ఇచ్చారు. తన పాలనలో ప్రభుత్వ పథకాలు అందితేనే ఓటు వేయండి అన్నారు. ఈ స్టేట్ మెంట్ ఇవ్వడానికి సీఎం కి చాలా గట్స్ ఉండాలి. తన పాలనపై తనకున్న నమ్మకమో ఏమో కానీ.. ఆ సాహసం చేశారు జగన్! అనంతరం… “ఆ మాట చెప్పడానికి గట్స్ ఊండాలి” అనే కామెంట్లు వైరల్ అయ్యాయి!
ఇదే క్రమంలో… ఉదయం లేచినప్పటినుండి జగంపై రకరకాల విమర్శలు చేస్తున్న చంద్రబాబు కూడా… “ఏపీలో కూడా ప్రభుత్వ పథకాలు అందినవారు అంతా జగన్ కే ఓటు వేయండి.. మిగిలిన వారు మాత్రం టీడీపీకి వేయండి – అని ఒక్క స్టేట్ మెంట్ ఇస్తే చాలు సరిపోతుంది కదా.. ఎవరి బండారం ఏమిటో తెలిసిపోతుంది” అని వైకాపా శ్రేణులు ఈ సందర్భంగా కామెంట్లు చేస్తుండగా… “ఈ విషయంలో మాత్రం తొందరపడకండి సర్.. రేవంత్ రెడ్డి ని ఫాలో అవ్వకండి సర్.. పుట్టే మునుగుతుంది సర్..” అంటూ చంద్రబాబుకు రిక్వస్ట్ లు పెడుతున్నారు టీడీపీ కార్యకర్తలు!
మరి ఈ విషయంలో రేవంత్ రెడ్డిని చంద్రబాబు ఫలో అవుతారా లేక “అబ్బే అలాంటివి ఏపీలో చెబితే – ఈసారి <23 అవుతాది” అని లైట్ తీసుకుంటారా అన్నది వేచి చూడాలి!!