కరోనా కల్లోలం నేపథ్యంలో సినీకార్మికుల్ని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ప్రారంభమైన సంగతి తెలిసిందే. సదరు చారిటీ సంస్థను రిజిస్టర్ చేయకపోయినా మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరపున నిధుల్ని సేకరించి సినీపరిశ్రమ 24 శాఖల కార్మికుల్ని ఆదుకుంటున్నామని పరిశ్రమ పెద్ద తమ్మారెడ్డి భరద్వాజా మీడియా ముఖంగానే వెల్లడించారు. ఇది మెగాస్టార్ కి ఇష్టం లేకపోయినా పరిశ్రమ తరపున బతిమాలి ఈ పని చేయాల్సి వచ్చిందని కూడా ఆయన వెల్లడించారు. కరోనా వల్ల రిజిస్టార్ ఆఫీసులు సహా అన్నీ స్థంబించిపోవడం వల్ల సీసీసీ చారిటీ రిజిస్ట్రేషన్ జరగలేదని కూడా వెల్లడించారు. అయితే ఈ చారిటీ ద్వారా నిరంతరాయంగా కార్మికులకు సాయం చేయాలన్న ఆలోచనతో ప్రారంభించామని తెలిపారు.
ప్రస్తుతం సీసీసీ ద్వారా నిధిని సేకరించి వచ్చిన విరాళాల నుంచి కార్మికులకు నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేస్తున్నారు. ఈ ఆదివారం నుంచి ఈ పనిని ప్రారంభించామని సీసీసీ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ పంపిణీకి విఘాతం జరగనుందా? ఇందులో తెరాస ప్రభుత్వం- నాయకులు ఇంటర్ ఫియర్ అవుతున్నారా? అంటే అవుననే సమాచారం అందుతోంది. సీసీసీ ఫండ్స్ పై తెలంగాణ ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతోందన్న గుసగుసలు తాజాగా వేడెక్కిస్తున్నాయి. దీంతో సడెన్ గా సీసీసీకి పరిశ్రమ ప్రముఖులు ఫండ్స్ ఇవ్వడం ఆగిపోయిందట. ఇక సినిమాకి సంబంధించిన ప్రముఖులు కూడా డైరెక్ట్ గా తెలంగాణ సీఎంవో కి మాత్రమే ఇస్తున్నారని ఓ ప్రచారం సాగుతోంది.
ఈ విరాళాలు కూడా కేటీఆర్ – తలసాని సమక్షంలోనే జరుగుతున్నాయి. అయితే సీసీసీపై డౌట్ వల్లనే ఇలా చేస్తున్నారా? అసలింతకీ తెరాస నాయకుల సందేహాలేమిటి? `మా` నిధి తరహాలో ఏదైనా తేడా జరుగుతుందనే భయమా? అన్నదానికి ఇంకా ఎలాంటి సమాధానం లేదు. కారణం ఏదైనా సీసీసీ ఆశించినంత పెద్ద స్థాయిలో సక్సెస్ అవ్వలేదన్న విమర్శలు ఓ సెక్షన్ నుంచి మొదలయ్యాయి. మరి వీటన్నిటిపైనా.. మరింత క్లారిటీ గా గోప్యంగా ఉన్న అసలు విషయాలు తెలియాల్సి ఉంటుంది మరి