చంపేస్తారట.! సింపతీ రాజకీయాలు మొదలు పెట్టిన చంద్రబాబు.!

ఎవరో ఓ ఎమ్మెల్యే సోదరుడు.. నోరు జారి ఓ మాట అంటే, దాన్ని పట్టుకుని సింపతీ రాజకీయాలు చేయడాన్ని ఏమనుకోవాలి.? సుదీర్ఘ రాజకీయ అనుభవం తన సొంతమని చెప్పుకునే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ‘నన్ను, నా కుమారుడు లోకేష్‌ని చంపేసేవారట..’ అంటూ జనం దగ్గరకు వెళ్ళి మొత్తుకుంటున్నారు.

‘నీకు రౌడీలు, గూండాలు, పోలీసులు అండగా వుంటారేమో.. నాకు ప్రజల అండ వుంది.. వాళ్ళే నన్ను కాపాడుకుంటారు..’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి.

టీడీపీ నేత పరిటాల రవిని హత్య చేసిన మొద్దు శీనుకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్క మాట చెప్పి వుంటే, చంద్రబాబు ఈపాటికి జీవించి వుండేవారు కాదన్నది వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్య. ‘హత్యా రాజకీయాలు మొదలైతే, మొదటి టార్గెట్ నారా లోకేష్’ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలకు చింతిస్తూ తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికే క్షమాపణ కూడా చెప్పారు. అయినాసరే, ఆయన వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. వైఎస్ జగన్ ప్రభుత్వం తక్షణం ఆయనపై కేసులు నమోదు చేయించి, అరెస్టు చేయించాల్సి వుంది. వైఎస్ జగన్ కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిందే.

ఎందుకంటే, వైఎస్ చంపించేసేవారు.. అనే అర్థం వచ్చేలా తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు మరి. సరే, ఆయనేదో అన్నాడు.. ప్రభుత్వమెలాంటి చర్యలు తీసుకుంటుందన్నది వేరే చర్చ. ‘నన్ను చంపేస్తారట.. నా కొడుకుని చంపేస్తారట..’ అంటూ చంద్రబాబు జనంలోకి వెళ్ళడమేంటి.?