తెలుగుదేశం పార్టీ వల్లనే జనసేన పార్టీకి ఎక్కువ నష్టం.! ఔను, వైసీపీ ఎంతలా జనసేనను విమర్శించినా, అది జనసేనకు పొలిటికల్ మైలేజ్ పెంచుకుంది. కానీ, చంద్రబాబుతో కరచాలనం వల్ల కూడా జనసేన పార్టీ స్థాయి దిగజారిపోతుంది.! ఇది గతంలోనే ప్రూవ్ అయ్యింది.. అది ఇంకోసారి నిరూపితమయ్యేలా వుంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విపరీతమైన హీట్ పెంచారు విశాఖ పర్యటన ద్వారా. నిజానికి, విశాఖ టూర్‌తో జనసేనాని అనూహ్యమైన రీతిలో పొలిటికల్ మైలేజ్ సాధించారు. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, అధికార పార్టీ వెన్నులో వణుకు మొదలైంది జనసేన పార్టీ విశాఖ ‘షో’ సందర్భంగా.
అధికార పార్టీ డబ్బులు గుమ్మరించినా జనాన్ని రప్పించలేకపోతోంటే.. జనసేన అధినేత సులువుగా లక్షల్లో జనాన్ని రప్పించేశారు. పైగా, విశాఖ రాజధాని సెంటిమెంట్ ఎక్కువగా వుందని వైసీపీ చెబుతున్న ఉత్తరాంధ్రలో జనసేనాని టూర్ సక్సెస్ అవడం విశేషమే మరి. బస చేసిన హోటల్ గది నుంచి బయటకు రాలేకపోయినా, జనసేనాని కావాల్సినంత పొలిటికల్ హీట్ పుట్టించగలిగారు.
విశాఖ నుంచి విజయవాడకు వచ్చాక కూడా ఆ హీట్ వేవ్ అలాగే కొనసాగేలా చేయగలిగారు పవన్ కళ్యాణ్. కానీ, ఒకే ఒక్క కరచాలనంతో జనసైన్యాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు అయోమయంలోకి నెట్టేశారు. ‘పవన్ కళ్యాణ్‌కి సంఘీభావం తెలిపేందుకు..’ అంటూ జనసేనానిని విజయవాడలో కలిశారు చంద్రబాబు.
అంతే, ఒక్కసారిగా ఈక్వేషన్ మారిపోయింది. ‘టీడీపీ జెండా మళ్ళీ భుజానికెత్తుకోవాలా.? ఏంటి.?’ అన్న అనుమానం చాలామంది జనసైనికుల్లో కలిగింది. ఇలాంటి విద్యలో చంద్రబాబు ఆరితేరినోడు. ఆ విషయం పవన్ కళ్యాణ్‌కి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో.!