వైసీపీ కొంప ముంచనున్న ‘కుల’ ప్రస్తావన.!

YSRCP

విపక్షంలో వున్నప్పుడు ఏదైనా మాట్లాడొచ్చు. అధికారంలో వున్నప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాలి కదా.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసే క్రమంలో తరచూ వైసీపీ ‘కులం’ ప్రస్తావన తెస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతలు ఎక్కువగా పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తున్నారు.

2019 ఎన్నికల్లో జనసేన బలమేంటో తేలిపోయింది. జనసేనను అసలు వైసీపీ పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. కానీ, టీడీపీ కంటే కాస్త ఎక్కువ సీరియస్‌గా జనసేన పార్టీ గురించి ఆలోచిస్తూ వైసీపీ తన గొయ్యి తానే తవ్వుకుంటోందన్నది నిర్వివాదాంశం.

వీకెండ్ రాజకీయాలు తప్ప, నిత్యం రాజకీయాలు చేసేంత ఓపిక జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి లేదని కూడా వైసీపీకి తెలుసు. తెలిసీ, ఎందుకు జనసేన విషయంలో వైసీపీ అత్యుత్సాహం చూపిస్తుందో ఏమో.! తాజాగా ‘కాపు నేస్తం’ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చారు. వైసీపీకి చెందిన కొందరు కీలక నేతలు కాపు సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ప్రస్తావన చేశారు.

సంక్షేమ పథకాల పేరుతో లబ్దిదారులకు నేరుగా డబ్బులు ఇస్తూ, తద్వారా పొలిటికల్ మైలేజ్ పొందే అవకాశం వైసీపీకి వుంది. చిత్రంగా, ఇలాంటి వేదికల నుంచి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడం, అందునా కాపు కుల ప్రస్తావన తీసుకురావడమంటే.. వైసీపీ సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్‌లోకి వెళుతున్నట్లే.

అనూహ్యంగా కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ మీద సింపతీ పెరుగుతోంది.. అదీ వైసీపీ చర్యల కారణంగానే. జరుగుతున్న డ్యామేజీ గురించి మంత్రులు కాకపోతే, సలహాదారులైన అధినేతకు తగు సమాచారమిస్తే మంచిది.!