రాజధానిగా విశాఖ.! వైఎస్ జగన్ ధైర్యమేంటి.?

ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదా రాజధానుల వ్యవహారానికి సంబంధించి కోర్టుల్లో పలు కేసులు విచారణ దశలో వున్నాయి. ఇలాంటి తరుణంలో రాజధాని కార్యకలాపాల్ని విశాఖకు తరలించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం, ముందు ముందు ఎలాంటి వివాదాలకు ఆస్కారమిస్తుందో ఏమో.!

నిజానికి, న్యాయస్థానాలకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ మొండి తనాన్ని ప్రదర్శిస్తున్నారు రాజధాని లేదా రాజధానుల విషయమై.. అన్న విమర్శలున్నాయి. దసరా నుంచే విశాఖలో రాజధాని కార్యకలాపాలని వైసీపీ నేతలు చెబుతున్నారు.

‘విశాఖలో కాపురం’ దిశగా వైఎస్ జగన్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ వుంటే అదే రాజధాని.. అన్నది వైసీపీ వాదన. సో, ముఖ్యమంత్రి గనుక విశాఖ వెళ్ళిపోతే, అదే రాజధాని అవుతుంది. అమరావతి కేవలం శాసన కార్యకలాపాలకే పరిమితం. జ్యుడీషియల్ క్యాపిటల్ అనేది ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయింది.

2024 ఎన్నికలకు ముందర ఇంకోసారి అసెంబ్లీ కార్యకలాపాలు జరగడం కష్టమే.. అన్న వాదన లేకపోలేదు. ముందస్తు ఎన్నికలు వెళితే, బడ్జెట్ అవసరం వుండదు. ఒకవేళ బడ్జెట్ సెషన్స్ జరిగినా.. అవి పూర్తిస్థాయి సెషన్స్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే, ఎన్నికలకు ముందర సమావేశాలు గనుక.

ఎలా చూసినా, శాసన కార్యకలాపాలతో ఇక ఇప్పటికి అవసరం లేదన్న భావనలో వైసీపీ వుండొచ్చు. అయినా, విశాఖ వేదికగా రాజధాని కార్యకలాపాలంటే.. అక్కడ అదనంగా ఒరిగేదేంటి.? ఈ విషయమై ఎలాంటి స్పష్టతా కనిపించడంలేదు.

కానీ, విశాఖను రాజధానిగా చేసుకుని పాలన ప్రారంభిస్తే, రాజధాని వివాదానికి సంబంధించి కొంత గందరగోళం తగ్గుతుంది. అయితే, కోర్టులు గనుక వైసీపీ సర్కారుకి షాకిస్తే.. పరిస్థితులు తేడా కొట్టేస్తాయ్.!