(యాత్ర స్పెషల్-2) జనం మెచ్చారు, మరి జగన్ సంకల్పం నెరవేరునా?

(కోపల్లె ఫణికుమార్ )

రాష్ట్రంలోనే కాకుండా జాతీయస్ధాయిలో కూడా సంచలనం సృష్టించిన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగింపుదశకు వచ్చేసింది. 341 రోజులు, 3648 కిలోమీటర్లు, దాదాపు 1.25 కోట్లమంది జనాలను ప్రత్యక్షంగా పలకరిస్తూ వారి బాధలు, సమస్యలు వింటూ సాగుతున్న ప్రజాసంకల్పయాత్ర పేరుతో జరుగుతున్న పాదయాత్ర రేపు అంటే 9వ తేదీన ఇచ్ఛాపురంలో జరిగే బహిరంగ సభతో ముగుస్తోంది. పాదయాత్రను జగన్ ఏదో మొక్కుబడిగా కాకుండా ఓ యజ్ఞంలాగ, ఘోర తప్పస్సులాగ చేపట్టారు. అందుకే ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎండ వానలను సైతం లెక్క చేయకుండా పాదయాత్రను పూర్తి చేయబోతున్నారు. 2017, నవంబర్ 6వ తేదీన ఇడుపులపాయలో మొదలైన పాదయాత్ర మొత్తం 13 జిల్లాలను చుట్టేసింది.

మొత్తం 13 జిల్లాల్లోని 2516 గ్రామాలను, 125 బహిరంగసభల్లో ప్రసంగిస్తూ, 135 నియోజకవర్గాల్లోని దాదాపు 237 మండలాలను టచ్ చేశారు. పాదయాత్రలో కావచ్చు లేదా బసచేసిన చోటా కావచ్చు తక్కువలో తక్కువ 10 వేల మందిని కలుసుకుని మాట్లాడారు. తన పాదయాత్రలో భాగంగా బహిరంగసభలు, ఆత్మీయ సమావేశాలు, సమ్మేళనాలు సందర్భం ఏదైనా కానీ జగన్ ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, నిరుద్యోగులతో మాట్లాడటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. జనాలతో మాట్లాడే ప్రతీ సందర్భంలోను చంద్రబాబునాయుడు నాలుగున్నరేళ్ళ పాలనలో పెరిగిపోయిన అవినీతిని, అక్రమాలను, వైఫల్యాలను విడమరచి చెప్పటం ద్వారా జనాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు.

ఎక్కడ పాదయాత్ర చేస్తున్న స్ధానిక జనాలు రోడ్లమీదకొచ్చేయటం లేదా మిద్దెలు, మేడలు ఎక్కటం అది సాధ్యం కాకపోతే అక్కడే ఉన్న చెట్లను సైతం ఎక్కి జగన్ ప్రసంగాలను వినటం, జగన్ ను చూడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మామూలుగా అయితే డబ్బులిస్తే వచ్చే జనాలు జగన్ కోసం వెయిట్ చేయరు, చెట్లు, పుట్టలెక్కి జగన్ ను చూడటం కోసం గంటల తరబడి వేచిఉండరు. జగన్ ను చూడాలన్న ఆశక్తి, ఉత్సాహమే గంటల పాటు జనాలను ఎక్కడికక్కడ కట్టిపడేసిందనటంలో సందేహం లేదు. చంద్రబాబు అవినీతి గురించి వివరిస్తున్నపుడు, చంద్రబాబును టార్గెట్ చేసుకుని ఆరోపణలు, విమర్శలు చేస్తున్నపుడు విపరీతంగా స్పందించంటం చూస్తేనే చంద్రబాబుపై జనాల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్ధమైపోతోంది. చంద్రబాబు మీద జనాల్లో ఈ స్ధాయిలో వ్యతిరేకత లేకపోతే జగన్ పాదయాత్ర ఇంతగా సక్సెస్ అయ్యేది కాదేమో ?

తన పాదయాత్రలో జగన్ ప్రధానంగా ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు సాధనలో చంద్రబాబు వైఫల్యాన్ని, నాలుగేళ్ళు ఎన్డీఏలో అంటకాగిన చంద్రబాబు వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పెరిగిపోయిన అవినీతిని, పాలనా వైఫల్యాలను బాగా ఎండగట్టారు. ప్రత్యేకహోదా డిమాండ్ తో ఎంపిలతో రాజీనామా చేయించటంతో చెప్పిన మాటకు జగన్ కట్టుబడుంటాడు అనే సిగ్నల్ జనాల్లోకి వెళ్ళింది. ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించేటపుడు కాపులను బిసిల్లో చేరుస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మోసం గురించి బాగా వివరించారు. అంటే ఏ జిల్లాలో పర్యటిస్తున్నా జిల్లాలోని ప్రధాన సమస్యలు, నియోజకవర్గాల్లో ప్రాధాన్యతా అంశాలను ప్రధానంగా హైలైట్ చేయటం ద్వారా స్ధానికులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు.

తనకు అధికారం అప్పగిస్తే చేయబోయే పనులేంటి ? ప్రాధాన్యతా అంశాలేంటి ? అందుకు తాన కార్యాచరణను కూడా వివరిస్తూ జనాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు పాలన ఎలాగుందో చూశారు కాబట్టి రానున్న ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ అభ్యర్ధించారు.  విశాఖపట్నంలో  జరిగిన హత్యాయత్నం తర్వాత జనాల్లో జగన్ పై విపరీతమైన క్రేజు పెరిగిందనే చెప్పాలి. తనను హత్య చేసేందుకు చంద్రబాబు అండ్ కో నే కుట్ర చేసిందనే వాదనను  జనాల్లోకి జగన్ బాగానే చొప్పించగలిగారు. దానికి తగ్గట్లే హత్యాయత్నంపై చంద్రబాబు అండ్ కో మాట్లాడిన విధానం తదితరాలు జగన్ కు బాగా కలసివచ్చాయి.  మొత్తానికి చంద్రబాబుకు వ్యతిరేకంగా జనాలను కదిలించాలన్న జగన్ సంకల్పం దాదాపు నెరవేరినట్లే. మరి ఎలక్షన్లో అనుసరించే వైఖరిపైనే జగన్ సక్సెస్ ఆధారపడుంది.