విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు మేం ఒప్పుకోం..’ అని తేల్చి చెప్పేశారు వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ (రాజ్యసభ) విజయసాయిరెడ్డి.. అదీ రాజ్యసభ సాక్షిగా. నిజానికి, విజయసాయిరెడ్డి కేంద్రానికి ఈ విషయమై తమ విధానాన్ని పార్లమెంటు సాక్షిగా స్పష్టం చేయడాన్ని అభినందించాలి. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలోనే ‘విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి మనకేమీ హక్కులు లేవు. అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పరిశ్రమ..’ అని తేల్చేశారు.
అలాంటప్పుడు, విజయసాయిరెడ్డి ‘మేం ఒప్పుకోం..’ అని కేంద్రానికి పార్లమెంటు సాక్షిగా తేల్చి చెప్పడం వల్ల ఉపయోగమేంటి.? వైసీపీ అధినేత, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి ఒకలా.. ఆ పార్టీకి చెందిన ఎంపీలు ఇంకొకలా వ్యవహరిస్తుండడం వల్ల ఈ వ్యవహారం పూర్తి గందరగోళంగా మారిపోతోంది. కేంద్రం, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు సంబంధించి అడుగులు చాలా వడివడిగా వేసేస్తోంది. విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి నిరుపయోగంగా వున్న భూముల సంగతి తర్వాత తేలుస్తాం.. ముందైతే, ప్రైవేటీకరణ పూర్తి చేస్తామని తాజాగా ఇంకోసారి కుండబద్దలుగొట్టేసింది కేంద్ర ప్రభుత్వం. రాజ్యసభ సభ్యులు, రాజ్యసభ నుంచి వాకౌట్ చేస్తే.. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆగిపోదు. ప్రధాని నరేంద్ర మోడీ యెదుట వైసీపీకి సంబంధించిన ఎంపీలంతా (రాజ్యసభ మరియు లోక్ సభ సభ్యులు) నిరసన తెలపాలి. పార్లమెంటు దద్దరిల్లిపోయేలా ఉద్యమించాలి.
ఈ క్రమంలో రాష్ట్రానికి చెందిన ఇతర పార్టీలకు చెందిన సభ్యుల్ని కలుపుకుపోవాలి. వీలైతే, దేశంలోని ఇతర రాజకీయ పార్టీలతోనూ మంతనాలు జరిపి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. ఇవన్నీ గతంలో టీడీపీ అధికారంలో వున్నప్పుడు వైసీపీ ఇచ్చిన ఉచిత సలహాలే. అన్నిటికీ మించి, ప్రత్యేక హోదా కోసం ఎంపీలంతా రాజీనామా చేయాలని ఎలాగైతే వైసీపీ డిమాండ్ చేసిందో.. ఇప్పుడు అదే డిమాండ్‌ని దృష్టిలో పెట్టకుని రాజీనామాలకు సిద్ధపడాలి. అలా జరగనప్పుడు.. కేంద్రాన్ని ఎంతలా నిలదీసినా ప్రయోజనం వుండదు.