రాజధాని అమరావతి కోసం లక్ష కోట్ల పైన ఖర్చు చేయాల్సి వుంటుందని గతంలోనే.. అంటే చంద్రబాబు హయాంలోనే అప్పటి ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయితే అమరావతిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా చంద్రబాబు అండ్ టీమ్ పేర్కొనడం విన్నాం. ఈ మోడల్ గురించి చాలా విశ్లేషణలు జరిగాయి.
అమరావతిని తాత్కాలికంగా చంద్రబాబు పేర్కొనడంలో ఆంతర్యమేంటి.? అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత దొరకదు. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, మండలి, తాత్కాలిక హైకోర్టు.. ఇలా అన్నిటికీ తాత్కాలిక పేర్లు పెట్టి చంద్రబాబు చాలా చాలా పెద్ద తప్పు చేశారు. ఆ తప్పులే రాష్ట్రం పాలిట శాపంగా మారాయ్. తాత్కాలికం అనే మాట గనుక అప్పట్లో చంద్రబాబు సర్కారు ఉపయోగించి వుండకపోతే, ఇప్పుడు పరిస్థితులు వేరేలా వుండేవి.
వైసీపీ ప్రస్తుతం మూడు రాజధానుల నినాదంతో ముందుకు వెళుతోంది. అలాగని, ఆ మూడిటిలో ఒకటైన అమరావతిని ముందుకు తీసుకెళుతుందా.? అంటే అదీ లేదు. అసలు సమస్య అదే. రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా గడిచిపోయాయ్. కానీ, అమరావతి ముందుకెళ్ళడంలేదు.. మూడు రాజధానులూ ముందుకు వెళ్ళడంలేదు.
తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఐదు నుంచి పది వేల కోట్లు విశాఖ మీద ఖర్చు చేస్తే మంచి రాజధాని అవుతుందని అభిప్రాయపడ్డారు. కర్నూలు న్యాయ రాజధాని అయితే రాయలసీమకు ఉపయుక్తమనీ ఆయన చెప్పుకొచ్చారు.
కానీ, విశాఖ మీద 5 నుంచి 10 కోట్లు ఖర్చు పెట్టగలగడం సాధ్యమేనా.? సంక్షేమ పథకాల కోసమే నిత్యం అప్పులు చేస్తున్న రాష్ట్రమది. సంక్షేమం అనే పులి మీద స్వారీ చేస్తోంది వైసీపీ సర్కారు. విశాఖ మీద ఖర్చు చేయలేదు.. అలాగని అమరావతినీ ముందుకు తీసుకెళ్ళలేదు.
వచ్చే ఎన్నికల్లో ఈ మూడు రాజధానుల అంశమే ఎన్నికల అజెండా అవుతుందని వైసీపీనే చెబుతోంది. అంటే, అప్పటిదాకా రాజధాని అనేది రాష్ట్రానికి వున్నా లేనట్టే.!