అప్పు చెయ్యని ప్రభుత్వాన్ని చూడగలమా.?

అప్పు చేస్తే తప్పు.. అది ఒకప్పుడు. ఇప్పుడైతే అప్పు చేయకపోతేనే తప్పు.! సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు ఎప్పుడైతే వెర్రి తలలు వేయడం మొదలైందో, అప్పటినుంచి అప్పులు చేయకుండా ప్రభుత్వాలు నడవలేని పరిస్థితి ఏర్పడింది.

ఏ రాజకీయ పార్టీ అయినాసరే, లక్షల కోట్ల అప్పులు చేసేలా ఎన్నికల మేనిఫెస్టోల్ని రూపొందిస్తుంటుంది. ‘మీ నెత్తిన ఇంత భారం మోపబోతున్నాం..’ అని ఎవరూ చెప్పరు. ఈ సంక్షేమ పథకాలతో మిమ్మల్ని ఉద్ధరించేస్తామని మాత్రమే చెబుతారు.
ఫలితం, ఆయా రాజకీయ పార్టీలు చేయబోయే అప్పుల గురించి ఆలోచించకుండా, తమకు ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చాక ఏదో మేలు చేసేస్తాయని భావించి.. ఇంకా సరిగ్గా చెప్పాలంటే, కక్కుర్తి పడి ఓట్లేస్తుంటారు జనాలు. నిజం ఎప్పుడూ నిష్టురంగానే వుంటుంది మరి.!

ఆంధ్రప్రదేశ్ అప్పులు చేసింది, తెలంగాణ కూడా అప్పులు చేసింది. కేంద్రమూ అప్పులు చేస్తోంది. అభివృద్ధి చేయాలంటే అప్పులు, సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే అప్పులు. పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయ్ సరే.! ఆదాయపు పన్ను చెల్లింపుదారుల పరిస్థితి ఏమిటి..

ప్రతియేడాదీ వేతన జీవి, తనకు ఆదాయపు పన్ను విషయంలో ఊరట దొరుకుతుందని ఎదురు చూస్తాడు. కానీ, ప్రతిసారీ వాత తప్పదు. ప్రభుత్వాలు అప్పులు చేయడం మానేస్తే, సంక్షేమ పథకాలు మానేస్తే.. అప్పుడు దేశం బాగుపడుతుందేమో.!