నరేంద్రమోడి గుంటూరు బహిరంగసభలో ఓ విషయం స్పష్టంగా చెప్పారు. అదేనండి చంద్రబాబునాయుడు, లోకేష్ అవినీతి గురించి. మాటిమాటికి మోడికన్నా తానే సీనియర్ ని అంటూ చంద్రబాబు ఊదరగొడుతుంటారు. అదే విషయాన్ని మోడి ప్రస్తావిస్తు అవినీతి, అక్రమార్జనలో తనకన్నా చంద్రబాబే సీనియర్ అంటూ ఎద్దేవా చేశారు. దాందో తండ్రి, కొడుకులకు ఒళ్ళుమండిపోయింది. పైగా తండ్రి, కొడుకుల అవినీతి ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో మట్టి కరవటం ఖాయమని కూడా మోడి జోస్యం చెప్పేశారు.
చంద్రబాబు లెక్కల మాయాజాలం గురించి మోడి చాలానే చెప్పారు. అమరావతి, పోలవరం సహా అన్నింటా దోపిడినేనే సాగుతోందని మోడి ధ్వజమెత్తారు. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడవటంలో కూడా చంద్రబాబే సీనియర్ అని మోడి ఒప్పేసుకున్నారు. రాష్ట్రంలో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని అందరూ అనుకుంటున్నదే. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని స్వయంగ్ కాగ్ ఎత్తి చూపింది కూడా. కాగ్ చెప్పినట్లు, మోడి అంటున్నట్లే అంతచేటు అవినీతి, అక్రమార్జనే జరుగుతుంటే మరి కేంద్రప్రభుత్వం ఎందుకు విచారణ జరిపించటం లేదు ? ఇపుడిదే ప్రశ్న అందరిలోను మెదులుతోంది.
వివిధ పథకాలకు కేంద్రం ఇస్తున్న నిధులు భారీ ఎత్తున రాష్ట్రంలో పక్కదారి పడుతుంటే, పాలకులు అవినీతికి పాల్పడుతుంటే కేంద్రం విచారణ జరిపించలేందా ? పథకాల్లో జరుగుతున్న అవినీతిపై నేరుగా కేంద్రం విచారణ జరిపించలేకపోవచ్చు. అవినీతి జరిగిందని కాగ్ నిర్ధారించిన తర్వాతైనా విచారణ జరిపించటం కేంద్రం బాధ్యత కాదా ? రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి లోకల్ బిజెపి నేతలు ఎప్పటి నుండో చంద్ర పురాణం వినిపిస్తున్నారు. తాజాగా మోడి కూడా అవే ఆరోపణలు చేశారు. మరి అవినీతి నిజమే అయితే విచారణ చేయించాల్సిన కేంద్రం ఎందుకు ఆరోపణలకే పరిమితమవుతోంది ?