సీమ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి టిడిపిలో చేరేందుకు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ముందుగా టిడిపిలోనే ఉన్నారు. రాష్ట్ర విభజనకు ముందు ఆయన రాయలసీమ పరిరక్షణ సమితిని స్థాపించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ కు రాజీనామా చేసి ఏ పార్టీలో చేరకుండా ఉన్నారు.
అయితే తాజాగా ఆయన టిడిపి అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లా శ్రీశైలం అభ్యర్ధిగా బుడ్డా రాజశేఖర్ రెడ్డిని టిడిపి ప్రకటించింది. కానీ ఆయన రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని చెప్పి అక్కడి నుంచి పోటి చేయనన్నారు. దీంతో శ్రీశైలం నుంచి పోటి చేసేందుకు బైరెడ్డి ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం.
శ్రీశైలం టికెట్ ఇవ్వాలని, పార్లమెంటు అభ్యర్ధిని కూడా గెలిపించే బాధ్యతను తీసుకుంటానని బైరెడ్డి టిడిపి నేతలకు చెప్పారని చర్చ జరుగుతోంది. చద్రబాబు కూడా బైరెడ్డికి టికెట్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. అన్ని కుదిరితే బుధ లేదా గురు వారాల్లో బైరెడ్డి సైకిల్ ఎక్కనున్నారు.